Wasim Jaffer on Siraj: సిరాజ్ ఇలా బౌలింగ్ చేస్తే బుమ్రాను మిస్ అవుతున్నామన్న ఫీలింగే ఉండదు: జాఫర్
Wasim Jaffer on Siraj: సిరాజ్ ఇలా బౌలింగ్ చేస్తే బుమ్రాను మిస్ అవుతున్నామన్న ఫీలింగే ఉండదని అన్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో సిరాజ్ 9 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Wasim Jaffer on Siraj: హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమిండియాలో తన స్థానాన్ని క్రమంగా సుస్థిరం చేసుకుంటున్నాడు. ఇన్నాళ్లూ టెస్ట్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ వచ్చిన అతడు.. ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లోనూ టీమ్‌లో కచ్చితంగా ఉంటున్నాడు. తాజాగా శ్రీలంకతో సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో లంక 73 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించిన అతడు.. ఓవరాల్‌గా సిరీస్‌లో 9 వికెట్లతో అదరగొట్టాడు.
దీంతో సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. వైట్‌బాల్ క్రికెట్‌లో సిరాజ్ ఈ మధ్యకాలంలో చాలా పురోగతి సాధించాడని అభిప్రాయపడ్డాడు. వన్డేల్లోనూ సిరాజ్ ఇలా బౌలింగ్ చేస్తుండటంతో ఇండియన్ టీమ్ బుమ్రా సేవలను మిస్ కాలేదని జాఫర్ అన్నాడు.
"ఓ వైట్ బాల్ బౌలర్‌గా అతడు సాధించిన పురోగతి మనం చూడొచ్చు. రెడ్ బాల్ బౌలింగ్ ఎలాగూ చాలా బాగుంది. కానీ గతేడాది కాలంగా వైట్‌బాల్ క్రికెట్‌లో అతడు పుంజుకున్న తీరు అద్భుతం. ఒక రకంగా సిరాజ్ ఇలా బౌలింగ్ చేస్తుంటే బుమ్రాను మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ కలగదు. బుమ్రాను మిస్ అవుతున్నామన్న ఆలోచన లేకపోతే టీమ్‌కు సిరాజ్ తీసుకొస్తున్న విలువెంతో అర్థం చేసుకోవచ్చు" అని జాఫర్ చెప్పాడు.
సిరాజే కాదు ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్‌పైనా జాఫర్ ప్రశంసలు కురిపించాడు. ఉమ్రాన్ రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీసుకున్నాడు. "ఈ సిరీస్‌లోని సానుకూలాంశాల్లో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. అతడు కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చినా అతని బౌలింగ్ తీరు బాగుంది. సిరాజ్ అయితే అద్భుతం. అతడు చాలా దూకుడుగా కనిపించాడు" అని జాఫర్ అన్నాడు.
"పరిస్థితులు బాగాలేని సమయాల్లోనూ అతడు వికెట్లు తీయడానికి ప్రయత్నించాడు. కొత్త బాల్‌తో బ్యాటర్లను ఔట్ చేయడం అంత సులువు కాదు. కానీ అతడు రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ చాలా నైపుణ్యంతో బౌలింగ్ చేశాడు" జాఫర్ చెప్పాడు.
సంబంధిత కథనం