IND vs SL 3rd Odi: మూడో వన్డేలో టీమ్ ఇండియా రికార్డ్ విక్టరీ - సిరీస్ క్లీన్ స్వీప్
IND vs SL 3rd Odi: ఆదివారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంకపై టీమ్ ఇండియా 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
IND vs SL 3rd Odi: శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విఫలమైన శ్రీలంక 73 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని మూట గట్టుకున్నది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ అద్భుత శతకాలతో రాణించారు. కోహ్లి 110 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 166 రన్స్ చేశాడు. శుభ్‌మన్ గిల్ 97 బాల్స్‌లో 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 116 రన్స్ చేశాడు. కోహ్లి, గిల్ మెరుపులతో భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 390 రన్స్ చేసింది.
రికార్డ్ టార్గెట్‌తో బరిలో దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 22 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. 19 రన్స్‌తో ఫెర్నాండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. షమీ, కుల్దీప్ యాదవ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం
శ్రీలంకతో మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పరుగులు తేడా పరంగా అతి పెద్ద విజయాన్ని అందుకున్న జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద ఉంది. ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును శ్రీలంకతో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా తిరగరాసింది.