Sarfaraz Khan Disappointed: నిద్ర కూడా పట్టలేదు.. కానీ డిప్రెషన్‌లోకి వెళ్లను: టీమిండియాలోకి ఎంపిక కాకపోవడంపై సర్ఫరాజ్
Sarfaraz Khan Disappointed: నిద్ర కూడా పట్టడం లేదు.. కానీ తాను డిప్రెషన్‌లోకి మాత్రం వెళ్లను అని అన్నాడు సర్ఫరాజ్ ఖాన్. టీమిండియాలోకి ఎంపిక కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అతడు.. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.
Sarfaraz Khan Disappointed: డొమెస్టిక్ క్రికెట్‌లో బ్రాడ్‌మన్‌లా పరుగుల వరద పారిస్తున్నా.. నేషనల్ సెలక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌ను కరుణించడం లేదు. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం కూడా ఎంపిక చేసిన టీమ్‌లో సర్ఫరాజ్‌ను కాదని సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు సర్ఫరాజ్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు.
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. టీమిండియాకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించేదే అయినా.. తాను ప్రయత్నం మాత్రం వదలనని స్పష్టం చేశాడు. 2019 నుంచి సర్ఫరాజ్ 22 ఇన్నింగ్స్‌లో 2289 రన్స్ చేశాడు. సగటు 134 కాగా.. అందులో 9 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ ఉన్నాయి. ఈ స్థాయిలో రాణిస్తున్నా కూడా తనను ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని సర్ఫరాజ్ అంటున్నాడు.
"నేను ఎక్కడికి వెళ్లినా..త్వరలోనే ఇండియన్ టీమ్‌లోకి వస్తానని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు నన్ను తీసుకోకపోవడంపై మాట్లాడుకుంటున్నారు. నా టైమ్ వస్తుందని అందరూ అంటున్నారు. టీమ్ ఎంపిక రోజు అస్సాం నుంచి ఢిల్లీ వచ్చాను.
ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను ఎందుకు టీమ్‌లో లేను? అనే ప్రశ్న నన్ను వేధించింది. మా నాన్నతో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చాను. నేను ప్రాక్టీస్ మానను. నేను డిప్రెషన్‌లోకి వెళ్లను. నేను ప్రయత్నిస్తూనే ఉంటా" అని సర్ఫరాజ్ చెప్పాడు.
సర్ఫరాజ్‌ను ఇప్పటికే తన ఫ్రెండ్స్ ఇండియా బ్రాడ్‌మన్ అని పిలవడం ప్రారంభించారు. కానీ సెలక్టర్లే ఎంత చేసినా కరుణించడం లేదు. "నేను పూర్తిగా నిరాశలో కూరుకుపోయాను. అన్ని పరుగులు చేసిన తర్వాత కూడా ఇలా అయితే ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది.
నేను కూడా మనిషినే. మెషీన్‌ను కాదు. నాకూ భావోద్వేగాలు ఉన్నాయి. నేను మా నాన్నతో మాట్లాడిన తర్వాత ఆయన ఢిల్లీ వచ్చారు. మన పని పరుగులు చేయడమే అని ఆయన చెప్పారు. ఏదో ఒక రోజు ఇండియాకు ఆడతావని నాలో స్ఫూర్తి నింపారు. అది నమ్మి, మిగతాదంతా విధికి వదిలేయాలి" అని సర్ఫరాజ్ అన్నాడు.
సంబంధిత కథనం