AB de Villiers on Virat Kohli: కోహ్లి మళ్లీ తండ్రి కావడం లేదు.. చాలా పెద్ద తప్పు చేశాను: డివిలియర్స్ షాకింగ్ యూటర్న్
AB de Villiers on Virat Kohli: విరాట్ కోహ్లి మళ్లీ తండ్రి కాబోతున్నాడని కొన్ని రోజుల కిందట చెప్పిన ఏబీ డివిలియర్స్ మాట మార్చాడు. తాను పొరపాటు పడ్డానని, అలాంటిదేమీ లేదని అతడు చెప్పడం గమనార్హం.
AB de Villiers on Virat Kohli: విరాట్ కోహ్లి ఆర్సీబీ మాజీ టీమ్మేట్, బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ మాట మార్చాడు. ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం కావడంతో అతడు మరోసారి తండ్రి కాబోతున్నాడని తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పిన అతడు.. అలాంటిదేమీ లేదని ఇప్పుడు వివరణ ఇచ్చాడు. తాను పొరపాటు పడ్డానని, కారణం ఏదైనా కోహ్లికి కుటుంబమే తొలి ప్రాధాన్యత కావాలని ఏబీ అనడం గమనార్హం.
కోహ్లి తండ్రి కావడం లేదు: డివిలియర్స్
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్.. కోహ్లి విషయంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని తాజాగా దైనిక్ భాస్కర్ పత్రికతో అన్నాడు. తనకు తప్పుడు సమాచారం వచ్చినట్లు తెలిపాడు. "కుటుంబమే ముందు.. ఆ తర్వాతే క్రికెట్. నేను నా యూట్యూబ్ ఛానెల్లో చాలా పెద్ద తప్పు చేశాను.
ఆ సమాచారం తప్పు. అందులో అసలు నిజం లేదు. కుటుంబ కారణాలతో నేషనల్ టీమ్ నుంచి బ్రేక్ తీసుకోవడానికి కోహ్లికి పూర్తి హక్కు ఉంది. కారణం ఏదైనా విరాట్ కు కుటుంబమే తొలి ప్రాధాన్యత. అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ ఏమీ తెలియదు. కానీ అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అతను బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏదైనా కోహ్లి బలంగా తిరిగి రావాలని అనుకుంటున్నాను" అని డివిలియర్స్ అన్నాడు.
గత ఆదివారం తన యూట్యూబ్ ఛానెల్లో డివిలియర్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లి మళ్లీ తండ్రి కాబోతున్నాడని, అందుకే బ్రేక్ తీసుకున్నాడని చెప్పాడు. అప్పటికే అనుష్క శర్మ మళ్లీ తల్లి కాబోతుందన్న వార్తల నేపథ్యంలో డివిలియర్స్ ఈ విషయాన్ని ధృవీకరించినట్లుగా అందరూ భావించారు. కానీ తాను చాలా పెద్ద తప్పు చేశానంటూ ఏబీ ఇలా యూటర్న్ తీసుకున్నాడు.
డివిలియర్స్ ఇలా చేయడమేంటి?
కోహ్లి విషయంలో తాను చాలా పెద్ద తప్పు చేశారని డివిలియర్స్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి అతడు అన్నట్లు ఇది చాలా పెద్ద తప్పిదమే. కోహ్లి, డివిలియర్స్ మధ్య ఎలాంటి స్నేహ బంధం ఉందో అందరికీ తెలుసు. తన బెస్ట్ ఫ్రెండ్ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏబీ నోరు జారేశాడు. ఇప్పుడు తప్పు చేసినట్లు అంగీకరించాడు.
అయితే ఏబీ మాటలతో విరాట్ కోహ్లి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందన్న సస్పెన్స్ మరింత పెరిగింది. తనతో ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు కూడా కోహ్లి ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదు. మరోవైపు అతడు ఇంగ్లండ్ తో మిగిలిన సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపైనా ఇంకా స్పష్టత రావడం లేదు.
హైదరాబాద్ లో తొలి టెస్టు కోసం టీమిండియాతో కలిసి రెండు రోజుల ముందే నగరానికి వచ్చిన విరాట్.. అదే రోజు తిరిగి వెళ్లిపోవడం, అతడు తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండడని బీసీసీఐ చెప్పడం తప్ప ఆ తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. అసలు కోహ్లి ఇండియాలో ఉన్నాడా లేదా అన్నది కూడా తెలియడం లేదు.