De Villiers on Virat Kohli: కోహ్లిని ఒక్క మాట కూడా అనొద్దు: విమర్శకులపై మండిపడిన డివిలియర్స్-ab de villiers says do not say a word to virat kohli it brings out best in him ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  De Villiers On Virat Kohli: కోహ్లిని ఒక్క మాట కూడా అనొద్దు: విమర్శకులపై మండిపడిన డివిలియర్స్

De Villiers on Virat Kohli: కోహ్లిని ఒక్క మాట కూడా అనొద్దు: విమర్శకులపై మండిపడిన డివిలియర్స్

Hari Prasad S HT Telugu
May 24, 2024 06:48 PM IST

De Villiers on Virat Kohli: విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై అతని ఆర్సీబీ మాజీ టీమ్మేట్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. కోహ్లిని విమర్శించొద్దని, ఒకవేళ అలా చేస్తే.. అతనిలో అత్యుత్తమ ఆట బయటకు వస్తుందని అనడం విశేషం.

కోహ్లిని ఒక్క మాట కూడా అనొద్దు: విమర్శకులపై మండిపడిన డివిలియర్స్
కోహ్లిని ఒక్క మాట కూడా అనొద్దు: విమర్శకులపై మండిపడిన డివిలియర్స్

De Villiers on Virat Kohli: విరాట్ కోహ్లికి మరోసారి మద్దతుగా నిలిచాడు అతని బెస్ట్ ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఈ మధ్య ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏబీ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కోహ్లిని ఒక్క మాట కూడా అనకూడదని, అలా చేస్తే అతనిలోని అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుందని ఏబీ అనడం విశేషం.

దేశానికి రోల్ మోడల్‌ను విమర్శిస్తారా?

కోహ్లిపై విమర్శలు, అది అతనిలో కసిని పెంచి తర్వాత ఆడిన తీరు తనకు బాగా నచ్చిందని డివిలియర్స్ అన్నాడు. హిందుస్థాన్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు అతడు ఇలా స్పందించాడు. "నేను అది బాగా ఎంజాయ్ చేశాను. కానీ దేశానికి ఓ రోల్ మోడల్ లాగా ఉన్న వ్యక్తి, హీరోలాంటి వ్యక్తిని ఇంతలా విమర్శించడం సరికాదు. అయితే అతని గురించి నాకు తెలుసు. అదే విషయాన్ని నేను నా షోలోనూ చెప్పాను.

అప్పుడు నేనేం చెప్పానంటే.. ఇతన్ని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చాలా ఏళ్ల పాటు నేను అతని ప్రత్యర్థిగా ఆడాను. నా ప్లేయర్స్ కు డ్రెస్సింగ్ రూమ్ లో ఒక్కటే విషయం చెప్పేవాడిని. విరాట్ ను ఒక్క మాట కూడా అనకూడదు. ఒకవేళ అతన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే వచ్చి భారీ సెంచరీ బాదేస్తాడు అని చెప్పేవాడిని" అని ఏబీ గుర్తు చేసుకున్నాడు.

అయితే కోహ్లి విమర్శకులకు ఏబీ థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ల విమర్శల వల్లే అతనిలో మళ్లీ దూకుడు పెరిగిందని, ఐపీఎల్ 2024లో ఆర్సీబీకి అదే ఉపయోగపడిందని డివిలియర్స్ అన్నాడు. ఐపీఎల్ 2024లో విరాట్ 15 మ్యాచ్ లలో 741 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 154.69 గా ఉంది. కానీ ఆర్సీబీ ఎలిమినేటర్ లో ఓడి వరుసగా 17వ సీజన్లోనూ కప్పు లేకుండానే ఇంటిదారి పట్టింది.

కోహ్లి ఓపెనర్‌గా చాలా రిస్క్

ఇక టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లిని ఓపెనింగ్ పంపాలన్న ఆలోచనపైనా డివిలియర్స్ స్పందించాడు. ఇది అస్సలు మంచి ఐడియా కాదని అతడు అనడం గమనార్హం. "అతడు మూడో స్థానంలో వచ్చే బ్యాటర్. అక్కడే చాలా ప్రభావవంతమైన ప్లేయర్ అని నేను అనుకుంటాను.

ఎక్కడికి వెళ్లినా అతడు బ్యాటింగ్ టీమ్ కు కెప్టెన్ లాంటి వాడు. బ్యాటింగ్ టీమ్ అన్ని వేళలా ప్రశాంతంగా ఉండేలా చేయగలడు. విరాట్ ఓపెనింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాడని నాకు తెలుసు. చాలా ఏళ్లుగా ఆడుతున్న అతని నిర్ణయాన్ని గౌరవించాలి. తన ఆట ఏంటో తనకు బాగా తెలుసు" అని ఏబీ అన్నాడు.

"కానీ ఒకవేళ నేను టీవీ గేమ్ ఎక్స్‌బాక్స్ ఆడితే నా టీమ్ లో అతడు మూడో స్థానంలోనే వస్తాడు. మ్యాచ్ తొలి రెండు ఓవర్లలో విరాట్ ను భారీ షాట్లు ఆడమని చెప్పడంలో చాలా రిస్క్ ఉంది. నా వరకూ కోహ్లి 4 నుంచి 16, 17 ఓవర్ల మధ్యలో ఆడాలి. అక్కడే అతడు అత్యుత్తమ బ్యాటర్. చాలా ప్రభావం చూపగలడు" అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.

Whats_app_banner