Yuvraj on Team India: టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ ఎంపిక చేసిన ఇండియా తుది జట్టు ఇదే..-yuvraj singh selected his t20 world cup xi of team india pant in sanju samson out ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yuvraj On Team India: టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ ఎంపిక చేసిన ఇండియా తుది జట్టు ఇదే..

Yuvraj on Team India: టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ ఎంపిక చేసిన ఇండియా తుది జట్టు ఇదే..

Hari Prasad S HT Telugu
May 22, 2024 01:13 PM IST

Yuvraj on Team India: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తుది జట్టును యువరాజ్ సింగ్ ఎంపిక చేశాడు. అతని టీమ్ లో సంజూ శాంసన్ కు బదులు రిషబ్ పంత్ కు ఛాన్స్ దక్కింది.

టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ ఎంపిక చేసిన ఇండియా తుది జట్టు ఇదే..
టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ ఎంపిక చేసిన ఇండియా తుది జట్టు ఇదే.. (PTI)

Yuvraj on Team India: టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియా తుది జట్టులో వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఉంది. సంజూ శాంసన్, రిషబ్ పంత్ లలో ఎవరికి చోటివ్వాలన్న సందిగ్ధత నెలకొంది. కానీ తాజాగా యువరాజ్ సింగ్ మాత్రం దానికి తెరదించాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టులో సంజూ బదులు రిషబ్ పంత్ కే అవకాశం ఇవ్వడం విశేషం.

యువరాజ్ సింగ్ ఓటు పంత్‌కే..

టీ20 వరల్డ్ కప్ 2024కు టైమ్ దగ్గర పడుతోంది. 2007 తర్వాత మళ్లీ ఈ మెగా టోర్నీ గెలవాలని చూస్తున్న ఇండియన్ టీమ్ ఈసారి అందుబాటులో ఉన్న పటిష్టమైన టీమ్ తో బరిలోకి దిగుతోంది. అయితే ఆ 15 మంది సభ్యుల్లో తుది 11 మందిలో ఎవరు ఉండాలి? ముఖ్యంగా వికెట్ కీపర్ ఎవరు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి మాజీ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్ సమాధానమిచ్చాడు.

అతడు సంజూ శాంసన్ బదులు రిషబ్ పంత్ కే ఓటేశాడు. "నేనైతే రిషబ్ నే ఎంపిక చేస్తాను. సంజూ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అయితే రిషబ్ లెఫ్ట్ హ్యాండర్. ఇండియాకు అతడు విజయాలు సాధించి పెట్టగలడు. గతంలోనూ అది చేసి చూపించాడు. టెస్టుల్లో ఎక్కువగా చేశాడు. పెద్ద టోర్నీల్లో అతడో మ్యాచ్ విన్నర్ అని నేను భావిస్తాను" అని ఐసీసీతో మాట్లాడుతూ యువరాజ్ అన్నాడు.

రోహిత్, యశస్వియే ఓపెనింగ్ చేయాలి

ఇక టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేస్తారన్న వార్తలు నేపథ్యంలో యువరాజ్ మాత్రం ఇది సరికాదని అంటున్నాడు. రోహిత్, యశస్వి జోడీనే కొనసాగించాలని చెబుతున్నాడు. ఐపీఎల్ 2024లో ఓపెనర్ గా కోహ్లి టాప్ ఫామ్ లో ఉండటంతో రోహిత్ కి సరైన జోడీ కోహ్లి అని అందరూ భావిస్తున్నా.. యువీ ఆలోచన మాత్రం మరోలా ఉంది.

"రోహిత్, జైస్వాల్ ఓపెన్ చేయాలని భావిస్తున్నాను. విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే అతని స్థానం. నాలుగో స్థానంలో సూర్య ఉంటాడు. ఆ తర్వాత రెండు మంచి ఆప్షన్లు ఉన్నాయి. నా వరకూ రెండేసి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్లు ఉండాలి. అలా అయితే బౌలింగ్ చేయడం ప్రత్యర్థులకు కష్టం అవుతుంది" అని యువీ అభిప్రాయపడ్డాడు.

ఇక బౌలింగ్ గురించి కూడా అతడు స్పందించాడు. "జట్టులోకి యుజువేంద్ర చహల్ తిరిగి రావడం బాగా అనిపించింది. అతడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ రెండో హాఫ్ లో వికెట్లు కాస్త నెమ్మదించవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆప్షన్లు ఉండటంలో తప్పులేదు. బుమ్రా, సిరాజ్ ఉన్నారు. అర్ష్‌దీప్ రూపంలో మరో అనుభవజ్ఞుడు కూడా ఉన్నాడు. మొత్తంగా చూస్తే బలమైన జట్టుగా కనిపిస్తోంది. దానిని నిరూపించుకోవాలి" అని యువరాజ్ స్పష్టం చేశాడు.

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్ తో మ్యాచ్ ఉంది.