Attack on TDP Office case : తెలియదు.. గుర్తులేదు.. పోలీసుల విచారణలో వైసీపీ నేతల సమాధానం ఇదే!-ysrcp leaders attended the police inquiry in the case of attack on tdp central office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Attack On Tdp Office Case : తెలియదు.. గుర్తులేదు.. పోలీసుల విచారణలో వైసీపీ నేతల సమాధానం ఇదే!

Attack on TDP Office case : తెలియదు.. గుర్తులేదు.. పోలీసుల విచారణలో వైసీపీ నేతల సమాధానం ఇదే!

Basani Shiva Kumar HT Telugu
Sep 15, 2024 01:09 PM IST

Attack on TDP Office case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే.. పోలీసుల విచారణకు వైసీపీ నేతలు సహకరించడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏది అడిగినా.. తెలియదు.. గుర్తు లేదని చెబుతున్నట్టు వివరించారు.

విచారణకు హాజరైన జోగి రమేష్
విచారణకు హాజరైన జోగి రమేష్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా.. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌, తలశిల రఘురామ్‌, లాయర్ గవాస్కర్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే.. వైసీపీ నేతలు విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా.. తెలియదు, గుర్తులేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శి,స్తున్నారని తెలుస్తోంది. దీంతో విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

పాస్‌పోర్ట్‌లు అందజేత..

అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస రావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలను విచారించారు. ఈ విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ నేతలు తమ పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించారు. దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ పాస్‌పోర్ట్ అప్పగించగా.. లేళ్ల అప్పిరెడ్డికి పాస్‌పోర్ట్ లేదని చెప్పినట్టు తెలిసింది. ఇటు జోగి రమేష్ పాస్‌పోర్ట్ గడువు ముగిసిందని.. చెప్పినట్టు సమాచారం. రెన్యువల్ చేయించాక పోలీసులకు అప్పగిస్తామని జోగి రమేష్ చెప్పినట్టు తెలిసింది.

వైసీపీ నేతలకు ఊరట..

సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని ఆదేశించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని సూచించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది. దీంతో అవినాష్, జోగి రమేష్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్టు అయ్యింది.

అవినాష్ దుబాయ్ వెళ్తుండగా..

ఆగస్టు 16న దేవినేని అవినాష్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాష్‌ ప్రయత్నించారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంతో.. అప్రమత్తమైన పోలీసులు దేవినేని అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

అవినాష్‌పై గురి..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో.. దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్‌ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల కిందట మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్‌ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నియోజకవర్గం నుంచి అవినాష్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ హయంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాష్‌ ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో చాలామంది టీడీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్యలు చేస్తుంటారు.

Whats_app_banner