Devineni Avinash : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు దేవినేని అవినాష్‌-devineni avinash petition in supreme court in case of attack on tdp office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Devineni Avinash : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు దేవినేని అవినాష్‌

Devineni Avinash : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు దేవినేని అవినాష్‌

Basani Shiva Kumar HT Telugu
Sep 09, 2024 05:42 PM IST

Devineni Avinash : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జగన్‌తో దేవినేని అవినాష్
జగన్‌తో దేవినేని అవినాష్ (X)

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో దేవినేని అవినాష్‌ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇటీవల అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టులో దేవినేని అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ పిటిషన్ మంగళవారం (రేపు) విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అడ్డుకున్న పోలీసులు..

ఆగస్టు 16న దేవినేని అవినాష్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాష్‌ ప్రయత్నించారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంతో.. అప్రమత్తమైన పోలీసులు దేవినేని అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

రెండు కేసుల్లో..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో.. దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్‌ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల కిందట మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్‌ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

టార్గెట్ దేవినేని అవినాష్..

2024 అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నియోజకవర్గం నుంచి అవినాష్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ హయంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాష్‌ ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో చాలామంది టీడీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్యలు చేస్తుంటారు.

జగన్ పిటిషన్‌పై విచారణ..

ఏపీ మాజీ సీఎం జగన్‌ పాస్‌పోర్ట్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. శుక్రవారం ఏపీ హైకోర్టులో జగన్ లంచ్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై తాజాగా విచారణ జరిగింది. ఐదేళ్లకు పాస్‌పోర్ట్‌ రెన్యువల్ చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ముగియగా.. ఈ నెల 11కు తీర్పును వాయిదా వేశారు. జగన్ పాస్‌పోర్ట్‌ రెన్యువల్ అవుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది.