Attack on TDP Office Case : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ.. తర్వాతి టార్గెట్ ఎవరంటే..
Attack on TDP Office Case : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందరి నేతల కోసం గాలిస్తున్నారు. దీంతో నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ జరుగుతోంది.
గుంటూరు జిల్లాలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. దీంతో ఈ కేసులో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ఎవరిని అరెస్టు చేస్తారో అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక పోలీస్ టీంలు వెళ్లాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.
వీరి పైనే ఎక్కువ ఆరోపణలు..
తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధానంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా.. ఇతర నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేశ్ తో పాటు మరికొంత మంది నేతల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో జోగి రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిల్ నిరాకరణ..
అయితే.. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే.. గురువారం ఉదయం బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, సాయంత్రం వైసీపీ కీలక నేత లేళ్ల అప్పరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాష్, తలశిల రఘురాం బయట ఉన్నారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
అవినాష్ పైనే ఆరోపణలు..
ఈ దాడి వ్యవహారంలో దేవినేని అవినాష్ పైనే ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని చెబుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అవినాష్ కూడా చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. అవినాష్ విజయవాడ వదిలి వెళ్లినట్టు సమాచారం. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.
అసలు ఏమిటీ కేసు..
2021లో టీడీపీ నేత పట్టాభి.. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఆరోపించింది. పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వైసీపీ నేతలు, తమ అనుచరులు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని.. తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో.. విజయవాడలోని పట్టాభీ ఇంటి పైనా దాడి జరిగింది. ఇంట్లోని సామాన్లను కూడా ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనల్లో దేవినేని అవినాష్ అనుచరులు ఎక్కువ మంది పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.