IPAC : వైసీపీ కోసం మళ్లీ.. ఏపీలో త్వరలో 'ఐప్యాక్' కార్యకలాపాలు ప్రారంభం.. జగన్ నమ్మకం అదే!-ipac is working again for ysrcp in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ipac : వైసీపీ కోసం మళ్లీ.. ఏపీలో త్వరలో 'ఐప్యాక్' కార్యకలాపాలు ప్రారంభం.. జగన్ నమ్మకం అదే!

IPAC : వైసీపీ కోసం మళ్లీ.. ఏపీలో త్వరలో 'ఐప్యాక్' కార్యకలాపాలు ప్రారంభం.. జగన్ నమ్మకం అదే!

Basani Shiva Kumar HT Telugu
Sep 15, 2024 05:45 AM IST

IPAC : 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమికి కారణాలు ఎన్ని ఉన్నా.. ఎక్కువ వేళ్లు మాత్రం పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ వైపే చూపించాయి. కొందరు నేతలు మీడియా ముందు ఐప్యాక్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. ఐప్యాక్ జగన్ కోసం మళ్లీ పనిచేయబోతోందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

విజయవాడ ఐప్యాక్ ఆఫీసులో జగన్ (ఫైల్ ఫొటో)
విజయవాడ ఐప్యాక్ ఆఫీసులో జగన్ (ఫైల్ ఫొటో) (@MeghaSPrasad)

ఐప్యాక్.. దేశంలోని ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ. గతంలో ఐప్యాక్ చాలా పార్టీలకు, చాలా రాష్ట్రాల్లో పని చేసింది. 2019, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున జగన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో పని చేసింది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించింది. కానీ.. 2024లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐప్యాక్‌కు ఎంత వచ్చిందో తెలియదు కానీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు మాత్రం అపవాదు మూటగట్టుకుంది. ఐప్యాక్ కారణంగానే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి.

మే నెలలో ఎన్నికలు అయిపోయాయి. జూన్ నెలలో ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఐప్యాక్ టీమ్ సైలెంట్ అయ్యింది. కానీ.. తాజాగా పొలిటికల్ సర్కిల్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఐప్యాక్ టీమ్ మళ్లీ జగన్ కోసం ఏపీలో పని చేయబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు తర్వాత ఓ మాజీమంత్రి మీడియా ముందుకు వచ్చి.. తమ పార్టీ ఓటమికి ఐప్యాక్ టీమ్ కారణమని ఆరోపించారు. ఆయనే కాదు.. చాలామంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐప్యాక్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

సెప్టెంబర్ నెలాఖరు లేదా.. ఆక్టోబర్ మాసం రెండో వారం నుంచి ఐప్యాక్ ఏపీలో మళ్లీ కార్యకలాపాలు సాగించవచ్చని తెలుస్తోంది. అయితే.. ఎన్నికల ముందు పనిచేసిన మాదిరిగా కాకుండా.. కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మాత్రమే గుర్తించి.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఐప్యాక్ పని చేయవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఇద్దరు ప్రతినిధుల చొప్పున నియమించి.. వారి ద్వారా కార్యకాలాపాలు సాగించేలా ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే.. వైసీపీలోని కొంతమంది నేతలు ఐప్యాక్ రీ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎవరు ఏం అనుకున్నా.. జగన్ మాత్రం ఐప్యాక్‌కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే.. 2024 ఎన్నికల ముందు ఐప్యాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్‌కు నచ్చినట్టు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా.. 'జగనన్నే మా భవిష్యత్తు', 'మా నమ్మకం నువ్వే జగన్', 'జగనన్న సురక్ష', 'జగనన్న ఆరోగ్య సురక్ష' 'వై ఏపీ నీడ్స్ జగన్' 'సిద్ధం', 'మేమంతా సిద్ధం' వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐప్యాక్ కీలక పాత్ర పోషించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో.. ఐప్యాక్‌ టీమ్‌ను మళ్లీ రంగంలోకి దింపి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్యాంపెయిన్లు రన్ చేయాలంటే పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఐప్యాక్‌కు జగన్ అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. 2024లో ఐప్యాక్ పనిచేసిన వైసీపీ ఓడిపోయినా.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించిందనే టాక్ వినిపిస్తోంది.