Attack on TDP Office : సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు
Attack on TDP Office : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు ఏపీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ కీలక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని ఆదేశించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని సూచించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది. దీంతో అవినాష్, జోగి రమేష్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్టు అయ్యింది.
దుబాయ్ వెళ్తుండగా..
ఆగస్టు 16న దేవినేని అవినాష్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాష్ ప్రయత్నించారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంతో.. అప్రమత్తమైన పోలీసులు దేవినేని అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
దేవినేని అవినాష్‌పైనే ఫోకస్..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో.. దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల కిందట మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
టార్గెట్ అవినాష్..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నియోజకవర్గం నుంచి అవినాష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ హయంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాష్ ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో చాలామంది టీడీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్యలు చేస్తుంటారు.