Tension in Palnadu : పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
Tension in Palnadu : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వాహనంపై ధ్వంసం అయ్యింది. పోలీసులు వచ్చి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వాహనం మీద టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. తమ పార్టీ నేతల పర్యటనను అడ్డుకోవాలని వాహనంపై కర్రలతో దాడి చేసినట్టు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి ఘటనలో వాహనం ధ్వంసం అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
ఖండించిన వైసీపీ..
నంబూరి శంకర్ రావు వాహనంపై దాడి ఘటనను వైసీపీ ఖండించింది. 'పల్నాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై దాడికి తెలుగుదేశం పార్టీ గూండాలు కుట్ర చేశారు. భారీ వర్షాలతో పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వెళ్లారు. శంకర్రావు కోసం వేచి ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేశారు. నాయకుల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పల్నాడులో ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యం, దాడులు చంద్రబాబు' అని వైసీపీ ప్రశ్నించింది.
నడిరోడ్డుపై దారుణ హత్య..
ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండ చెక్‌పోస్టు సెంటర్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ఓ యువకుడు మరో యువకుడిని దారుణంగా నరికాడు. వినుకొండ వైసీపీ యువజన విభాగ నాయకుడు రషీద్‌పై షేక్ జిలానీ అనే యువకుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. అందరూ చూస్తుండగానే రషీద్‌పై దాడి చేశాడు. రషీద్ రెండు చేతులు తెగిపోయాయి. మెడ వద్ద తీవ్ర గాయమైంది. రక్తపుమడుగులో కుప్పకూలి రషీద్ మృతి చెందాడు. ఈ ఘటనతో వినుకొండ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
పరస్పరం ఆరోపణలు..
ఈ ఘటన తర్వాత జిలానీకి సంబంధించిన కొన్ని ఫోటోలను వైసీపీ విడుదల చేసింది. టీడీపీ కూడా జిలానీ వైసీపీ నేతలతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. చనిపోయిన షేక్ రషీద్, చంపిన షేక్ జిలానీలు వైసీపీకి చెందినవాళ్లని టీడీపీ ఆరోపిస్తోంది. వీరిద్దరూ వినుకొండలో రౌడీలుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిలానీ టీడీపీ సానుభూతిపరుడని వైసీపీ ఆరోపించింది. టీడీపీ పెద్దల అండదండలతో జిలానీ అరాచకాలు చేస్తున్నారని.. అతడ్ని కఠినంగా శిక్షించాలని వైసీపీ డిమాండ్ చేసింది. మృతుడి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు.