Prakasam Barrage Boats Case : ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్- టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు
Prakasam Barrage Boats Case : ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల వరదల సమయంలో నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి.
Prakasam Barrage Boats Case : ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు...ఇద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది. వరదల సమయంలో నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ బోట్లలో మూడు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఉషాద్రితోపాటు, సూరాయపాలెంకు చెందిన కోమటి రెడ్డి రామ్మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు.
సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను నాలుగు పడవలు ఢీ కొట్టాయి. ఈ పడవలకు ఓ పార్టీ రంగులు వేసి ఉండడంతో అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బోట్లు ఢీకొట్టడంతో...67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ బోట్ల వాటి యజమానులు రాకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఉందని పోలీసులు గుర్తించారు. వాటిని ఉద్దేశపూర్వకంగా దిగువకు వదిలారా? ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మూడు పడవలకు వైసీపీ రంగులు ఉండడంతో ఆ పార్టీ నేతల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పడవల ఘటనపై టీడీపీ, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఆ పడవల యాజమానులలో ఒకరైన కోమటి రెడ్డి రామ్మోహన్ మీ వాడే , కాదు మీ వాడే అంటూ వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ చేస్తు్న్నారు. ఇరు పార్టీల నేతలతో రామ్మోహన్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నాయి. బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో కుట్రకోణం ఉందని టీడీపీ ఆరోపిస్తుంటే, వరదల సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందని, వాటి నుంచి డైవర్ట్ చేసేందుకు బోట్ల నాటకం ఆడుతున్నారని వైసీపీ విమర్శిస్తుంది.
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లును ఏర్పాటు చేశారు. 67, 69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజినీర్లు మరమ్మతులు పూర్తి చేశారు. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో స్టీల్‌తో తయారుచేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు బిగించారు. ఇరిగేషన్ చీఫ్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు సూచనలతో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తి చేశారు. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టింది. ఐదు రోజులు రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు.
సీఎం చంద్రబాబు సహకారం, ప్రోత్సాహం పనులు వేగవంతంగా పూర్తి చేశామని కన్నయ్య నాయుడు తెలిపారు. గేట్లు మరమ్మతు పనులు పూర్తి చేశామని, ఆ మూడు గేట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. రైతులకు నష్టం జరగకూడదనే రేయింబవళ్లు కష్టపడి పనిచేసి పూర్తి చేశామన్నారు. విరిగిపోయిన కౌంటర్ వెయిట్ తొలగిచామన్నారు. రేపు బోట్లు తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం