Barrage Accident: ప్రకాశం బ్యారేజీ ప్రమాదంపై దర్యాప్తు, ఘటనలో కుట్రకోణంపై అనుమానాలు…-investigation into prakasam barrage accident suspicions of conspiracy in the incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Barrage Accident: ప్రకాశం బ్యారేజీ ప్రమాదంపై దర్యాప్తు, ఘటనలో కుట్రకోణంపై అనుమానాలు…

Barrage Accident: ప్రకాశం బ్యారేజీ ప్రమాదంపై దర్యాప్తు, ఘటనలో కుట్రకోణంపై అనుమానాలు…

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 09, 2024 02:01 PM IST

Barrage Accident: ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని.. అన్నంపెట్టే అన్నదాతలకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

Barrage Accident: ప్రకాశం బ్యారేజీని డ్రెడ్జింగ్ పడవలు ఢీ కొట్టిన వ్యవహారంలో కుట్ర కోణం ఉందని ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ ఘటనలో నిందితులు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 1854 నుంచి 1952 వరకు దాదాపు 100 సంవత్సరాల పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు బ్యారేజీ సేవలందించిందని.. 1952 లో వచ్చిన వరదలకు బ్యారేజీ దెబ్బతినడంతో ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరును పెట్టడం జరిగిందన్నారు.

1957 నుంచి దాదాపు 13.8 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా అందుతున్నాయి. ఈ బ్యారేజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు వరప్రదాయనిగా నిర్విరామంగా సేవలందిస్తోంది. ఆ విధంగా పాత ఆనకట్ట వంద సంవత్సరాలు, కొత్త ఆనకట్టకు దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉందని, దాదాపు 170 సంవత్సరాల ఘన చరిత్ర ప్రకాశం బ్యారేజీ కి ఉందన్నారు.

పడవలు ఢీకొట్టడంపై అనుమానాలు..

11,42,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన కీలక పరిస్థితిలో ఐదు పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉందనే అభిప్రాయం అందరిలోనూ ఉందని ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ సాగిస్తున్నాయని చెప్పారు. ఒక్కొక్కటి 40-50 టన్నుల బరువున్న ఐదు పడవలు అధిక వరద వస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లను దాటుకొని కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొట్టాయన్నారు.

అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడానికి, గేట్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా బోట్లు కౌంటర్ వెయిట్ ను ఢీకొన్నాయని, గేట్లను కాని ప్రధాన కట్టడాన్ని గాని ఢీకొని ఉంటే ఐదారు జిల్లాలకు ఎంత నష్టం జరిగేదో ఊహించడానికి కష్టంగా ఉందన్నారు.

ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ శాఖ నుంచి పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసిందని, ఈ కేసు దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోందన్నారు. ఈ మొత్తం ఘటన పలు అనుమానాలకు తావిస్తోందని.. రైతులు, రైతు సంఘాలు అంటున్నాయి. ఇలాంటి అధిక బరువు కలిగిన బోట్లను సాధారణంగా నది ఒడ్డున లంగర్ వేసి ఉంచుతారని చెప్పారు.

ఒక్కో బోటు విలువ రూ. 40-50 లక్షలు ఉంటే.. అంతటి విలువైన 3 బోట్లను ఒకే ప్లాస్టిక్ తాడుతో కట్టడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇంతటి విలువైన పడవలను జాగ్రత్త చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే ఇలా బ్యారేజీని ఢీకొట్టేలా చేశారా అనే అనుమానాలు పెద్దఎత్తున వస్తున్నాయన్నారు. మొత్తం ఐదు పడవల్లో ఒక పడవ గేట్ల మధ్య నుంచి కిందకు వెళ్లిపోయిందని, మూడు పడవలను గుర్తించామని, మరో పడవ ఆచూకీ తెలుసుకుంటున్నట్టు చెప్పారు.

మూడు పడవలకు యజమాని ఒకరే కావడం అనుమానానికి దారితీస్తోందని, ఈ పడవల యజమాని అయిన ఉషాద్రి.. కోమటి రామ్మోహన్ కు అనుచరుడిగా ఉన్నారని చెప్పారు.కోమటి రామ్మోహన్ తలశిల రఘురాంతో బంధుత్వం ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు.

గత ప్రభుత్వ అండదండలతో నందిగం సురేష్ వీరంతా సిండికేట్ గా ఏర్పడి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అక్రమంగా లూటీ చేశారని, పడవలకు వైఎస్ఆర్ సీపీ రంగులు కూడా ఉండడం.. ఈ బోట్లు అధికారిక పార్టీకి సంబంధించినవి అని చెప్పేలా రంగులు వేసుకున్న పరిస్థితి కనిపించిందన్నారు. ఇలా దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు వస్తోందని మంత్రి చెప్పారు.

స్థానికులు హెచ్చరించినా వినలేదు…

బోట్లను లంగరు వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని స్థానికులు చెప్పినా సరే నిర్లక్ష్యం చేశారంటే వారి మనసులో వేరే తప్పుడు భావన ఉందని దర్యాప్తులో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, మూడు బోట్లు అంతకుముందు గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెం వైపు ఉండేవని వరదకు కొన్ని రోజుల ముందే వాటిని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ప్లాస్టిక్ వైరుతో కట్టి ఉంచినట్లు తెలుస్తోందన్నారు.

ఉద్దేశపూర్వకంగానే వరద వేగానికి కొట్టుకొచ్చేలా ఉంచారా అనే అనుమానం వస్తోందని ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డపేరు కలిగించాలనే ఆలోచన వారిలో ఉందా అనే అనుమానం వస్తోందననారు.కన్నయ్య నాయుడు నేతృత్వంలో కౌంటర్ వెయిట్లను ఐరన్ దిమ్మలతో ఏర్పాటు చేస్తున్నట్టుచెప్పారు.

రెండు రోజుల్లోగా పనుల పూర్తికి కృషిచేస్తున్నామని, ఏ చిన్న రిస్కు కూడా తీసుకోకుండా పనులు చేపడుతున్నామని చెప్పారు.. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రవాహం వెళ్తుండగానే తుంగభద్ర డ్యామ్ గేటును బిగించిన పని కన్నయ్యనాయుడు నేతృత్వంలో జరిగిందని వరద ప్రవాహానికి గేటు కొట్టుకుపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను.. మళ్లీ తిరిగి గేటు అమర్చిన తర్వాత అదే రైతుల కళ్ళల్లో ఆనందం చూసానని ఆరోజు కన్నయ్య నాయుడు చెప్పారు. అందుకే ఆయన సూచనలు సలహాలతో ప్రకాశం బ్యారేజీ విషయంలో కూడా ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి సూచించారన్నారు.

ఎక్కడా చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ రెండు రోజుల్లో పనుల పూర్తికి కృషి చేయడం జరుగుతుంది. రాజకీయపరంగా కాకుండా ప్రకాశం బ్యారేజీ భద్రత పరంగా ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు.