Flood Alert : విజయవాడకు పొంచి ఉన్న ముప్పు.. ఓవైపు కృష్ణమ్మ.. మరోవైపు బుడమేరు! బ్యారేజ్‌ గేట్లను ఢీకొన్న బోట్లు-krishna river and budameru canal flood threat to vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Flood Alert : విజయవాడకు పొంచి ఉన్న ముప్పు.. ఓవైపు కృష్ణమ్మ.. మరోవైపు బుడమేరు! బ్యారేజ్‌ గేట్లను ఢీకొన్న బోట్లు

Flood Alert : విజయవాడకు పొంచి ఉన్న ముప్పు.. ఓవైపు కృష్ణమ్మ.. మరోవైపు బుడమేరు! బ్యారేజ్‌ గేట్లను ఢీకొన్న బోట్లు

Basani Shiva Kumar HT Telugu
Sep 02, 2024 10:04 AM IST

Flood Alert : చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ కారణంగా.. బెజవాడ గజ గజ వణికిపోతోంది. ఓవైపు వర్షాలు విరుచుకుపడుతుంటే.. మరోవైపు వరదలు భయపెడుతున్నాయి. ఇటు విజయవాడ నగరానికి కృష్ణా నది, బుడమేరు నుంచి వరద ముప్పు ముంచుకొస్తోంది.

విజయవాడకు వరద ముప్పు
విజయవాడకు వరద ముప్పు

విజయవాడ నగరానికి వరద ముప్పు ముంచుకొస్తుంది. రెండు వైపుల నుంచి వరద ఉధృతి పెరుగుతోంది. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు వరదలతో విజయవాడ నగరం తల్లడిల్లుతోంది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో నమోదవుతోంది. వరద నీరు 11 లక్షల క్యూసెక్కులు దాటింది. 12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరద అని చెబుతున్నారు. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 కాలనీలు, పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది.

పెను ప్రమాదం..

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. పెను ప్రమాదంజరిగింది. బ్యారేజ్‌ 3,4 గేట్లను మూడు బోట్లు ఢీకొన్నాయి. 40 కి.మీ వేగంతో బ్యారేజ్‌ గేట్లను బోట్లు ఢీకొన్నట్టు తెలుస్తోంది. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అటు శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లలో సాంకేతిక సమస్య వచ్చింది. 2, 3 గేట్ల ప్యానల్‌లో బ్రేక్‌ కాయిల్ కాలిపోయింది. వరద ఉధృతితో గేట్ల హైట్‌ పెంచుతుండగా ఈ ఘటన జరిగింది. బ్రేక్‌ కాయిల్స్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వరదలపై అమిత్ షా ఆరా..

సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలోని వరద పరిస్థితులను చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సింగ్‌నగర్‌ వరద ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం పర్యటించిన తరువాత.. విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష చేశారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం అదనపు బోట్లు, ట్రాక్టర్లు తెప్పించాలని అధికారులకు సూచించారు. సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే బస చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

కృష్ణా నదికి గండి..

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారధి వద్ద కృష్ణా నదికి గండి పడింది. ఇటుక బట్టీ, పంట పొలాల్లోకి నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా గొల్లపూడిని వరద ముంచెత్తింది. శ్రీశైలం కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి చిక్కుకున్నారు. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. అటు దోర్నాల శ్రీశైలం ఘాట్‌రోడ్డులో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దోర్నాల శ్రీశైలం ఘాట్‌ రోడ్డును పోలీసులు మూసివేసిశారు. మన్ననూరు చెక్‌పోస్ట్‌ దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు.

కొత్త రూట్ సూచించిన పోలీసులు..

ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ను పోలీసులు సూచించారు. తాము సూచించిన రూట్‌లో ప్రయాణం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌- చిట్యాల- నార్కట్‌పల్లి- నల్గొండ- మిర్యాలగూడ- పిడుగురాళ్ల- గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలని సూచించారు. ఖమ్మం వెళ్లే వారు.. చౌటుప్పల్‌- చిట్యాల- నార్కట్‌పల్లి- అరవపల్లి- తుంగతుర్తి- మద్దిరాల- మర్రిపేట మీదుగా వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గే వరకూ ఈ రూట్లలో ప్రయాణించాలని సూచించారు. అటు హైదరాబాద్- విజయవాడ హైవేపై వర్షపు నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది.