Polavaram Project : 'చంద్రబాబు గారు.. ఇంతటి తీరని అన్యాయం చేస్తారా..?' పోలవరం ఎత్తుపై జగన్ 6 ప్రశ్నలు-ys jagan six questions to cm chandrababu on polavaram height issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Project : 'చంద్రబాబు గారు.. ఇంతటి తీరని అన్యాయం చేస్తారా..?' పోలవరం ఎత్తుపై జగన్ 6 ప్రశ్నలు

Polavaram Project : 'చంద్రబాబు గారు.. ఇంతటి తీరని అన్యాయం చేస్తారా..?' పోలవరం ఎత్తుపై జగన్ 6 ప్రశ్నలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 31, 2024 05:59 PM IST

పోలవరం ఎత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. పోలవరం ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు

కొద్దిరోజులుగా ఒక్కో అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా పోలవరం ఎత్తు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరు ప్రశ్నలు సంధించారు. డ్యామ్ ఎత్తున పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకు చేతులెత్తేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించాలని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు:

  1. చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు…?
  2. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితం చేస్తున్నారు…? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడంలేదు…? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీని వెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబు గారూ….?
  3. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా చంద్రబాబుగారు… మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడంకోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానిఇక జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు.
  4. చంద్రబాబుగారు గతంలో మీరు మీ స్వార్థంకోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్‌డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తిచేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రంవాల్‌ కట్టారు. ఆ నిర్మాణాల్లోకూడా లోపాలే. కాఫర్‌డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్‌డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు. తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పులనుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప… పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయితీ లేదు.
  5. మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది… ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైయస్సార్‌సీపీ హయాంలో చేశాం. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్, అప్రోచ్‌ఛానల్‌, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశాం. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాదు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ. 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ చంద్రబాబుగారు… మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బును విడుదల చేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
  6. చంద్రబాబు గారూ.. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రం వాల్‌ను పూర్తిచేసి, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాంను కట్టడంతోపాటు, ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఇవ్వాలి. ఇవన్నీ పూర్తి చేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది…?వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు" అంటూ జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం