Strategic victory for YCP: టీడీపీని కేసుల్లో బిజీగా ఉంచేలా చేయడమే వైసీపీ అసలు వ్యూహం
Strategic victory for YCP: ఫలానా కేసులో తీర్పు వాయిదా, ఇంకో కేసులో వాదనలు పూర్తి, మరో కేసులో విచారణ వాయిదా, అదేదో కేసులో తాత్కలిక ఉపశమనం ఇవన్నీ చూస్తుంటే టీడీపీ విషయంలో వైసీపీ అధినేత వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది.
Strategic victory for YCP: దాదాపు నెల రోజులుగా టీడీపీని గుక్కతిప్పు కోనివ్వకుండా చేయడంలో జగన్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నట్టు స్పష్టం అవుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు మరో నాలుగురోజుల్లో నెల పూర్తవుతుంది. చంద్రబాబును అరెస్ట్ చేయడమనేది కల్లో కూడా సాధ్యం కాదనుకునే పరిస్థితుల నుంచి ఏకంగా నెల రోజుల పాటు జైల్లో ఉంచడం వెనుక వైసీపీ చాలా వర్కౌట్ చేసినట్టు కనిపిస్తోంది.
నాలుగున్నరేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆర్నెల్లు పాలనలో కుదురుకోడానికే సరిపోయింది. ఆ తర్వాత నుంచి ప్రతిపక్షాలు, పత్రికలతో యుద్ధం చేయడానికే సమయం చాల్లేదు. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన సంతోషం కంటే కోర్టుల్లో ఎదుర్కొన్న చివాట్లు, ఎదురు దెబ్బలే ఎక్కువ కనిపిస్తాయి.
పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు కావొచ్చు, స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన కావొచ్చు, పాఠశాలల హేతుబద్దీకరణ, రాజధాని తరలింపు, మూడు రాజధానులు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, బకాయిలు చెల్లింపులు, పెన్షన్లు, వేతనాల చెల్లింపు, అమరావతి నిర్మాణం కొనసాగింపు ఇలా ఒకటేమిటి పదుల సంఖ్యలో వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వం ఏ విషయంలో ముందడుగు వేసినా ఏదో రకంగా అటంకాలు తలెత్తేవి.
151మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామనే సంతోషం చాలా కాలం పాటు వైసీపీకి దక్కనే లేదు. కోర్టు వివాదాల రూపంలో ప్రభుత్వానికి అడుగడుగున సమస్యలు, అడ్డంకులు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఎదుర్కొన్న పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పక్కా వ్యూహాన్ని జగన్ అమలు చేయగలుగుతున్నారు.ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా ఎలాంటి తడబాటు లేకుండా టార్గెట్లను పూర్తి చేస్తున్నాయి. ఇందులో కక్ష సాధింపు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు అనే విమర్శలు కూడా ఉన్నా వైసీపీ ప్రధాన శత్రువైన టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీయడంలో ప్రస్తుతానికి విజయం సాధించాయి.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏపీ హైకోర్టులో జరిగిన విచారణ తాలుకా డాక్యుమెంట్లు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ వచ్చే సోమవారం కొలిక్కి వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బుధవారం సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది.
సిఐడి విచారణ, 41ఏ నోటీసులపై లోకేష్ హైకోర్టును ఆశ్రయించడంతో సిఐడి విచారణ అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా లోకేష్ తాత్కలిక ఊరట దక్కింది. లోకేష్‌ను అరెస్ట్ చేయొచ్చనే అనుమానాలు ఆయన తరపు న్యాయవాదుల్లో ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ తరపున దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అనుమానాలు తలెత్తాయి.
41ఏ నోటీసులు ఇచ్చి, నోటీసులకు కట్టుబడలేదనే సాకుతో లోకేష్‌నున అరెస్ట్ చేయొచ్చని, చంద్రబాబును కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్పటికప్పుడు చేర్చి అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.
చంద్రబాబు అరెస్టై, రిమాండ్‌కు వెళ్లిన తర్వాత సెప్టెంబర్ 14వ తేదీ నుంచి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. బుధవారం సిఐడి విచారణకు హాజరవుతారని భావించినా ఆయనకు హైకోర్టులో మరో వారం ఉపశమనం లభించింది. దీంతో లోకేష్, సిఐడిల వ్యవహారం టామ్ అండ్ జెర్రీ మాదిరి మారిపోయింది.
చంద్రబాబు జైల్లో ఉంటూ, లోకేష్ పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేని పరిస్థితుల్లోకి నెట్టడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకేష్ యాక్టివ్ అయితే అందుకు తగ్గట్టుగా దూకుడు ప్రదర్శించొచ్చని అధికార పక్షం భావిస్తోంది. ప్రస్తుతానికి బాబును జైలుకు, లోకేష్‌ను ఢిల్లీకి పరిమితం చేయడం ద్వారా వైసీపీ ఆశించిన లక్ష్యాన్ని చేరుకున్నట్టైంది.