YCP Mla Jonnagadda: శింగనమల ఎమ్మెల్యే పద్మావతి నిరసన గళం..
YCP Mla Jonnagadda: వైసీపీలో మరో ఎమ్మెల్యే నిరసన గళం విప్పారు. అనంతపురం జిల్లాలో ఓ సామాజిక వర్గం పెత్తనం కొనసాగుతోంది దళిత ఎమ్మెల్యేపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించడం కలకలం రేపింది.
YCP Mla Jonnagadda: ఏపీ అధికార పార్టీలో టిక్కెట్ల రగడ జరుగుతున్న సమయంలో అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా పార్టీలో తన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజక వర్గానికి రావాల్సిన నీటి కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. తమ నియోజక వర్గంలో ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదని, 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని నిలదీశారు.
ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా అని ప్రశ్నించారు. చేతులు కట్టుకుని నిలబడితేనే నిధులు విడుదల చేస్తారా అని ప్రశ్నించారు.
తన నియోజక వర్గంలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు వేస్తే మాత్రమే తాను ఎమ్మెల్యే కాలేదని చెప్పారు. కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారని, తాను మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం జగన్… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుస్తున్నారని ఆరోపించారు.
తనకు టికెట్ కేటాయించట్లేదని సీఎం చెప్పారని, నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏ మాత్రం సహకరించ లేదని ఆరోపించారు. తన పట్ల, తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారని, ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంను అభ్యర్థించినా తాడేపల్లి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏమీ చేయలేక పోయానని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు.
దళిత ఎమ్మెల్యేను కాబట్టే తనపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిలను లక్ష్యంగా చేసుకుని పద్మావతి విమర్శలు గుప్పించారు.
ఎస్సీ నియోజక వర్గంలో అన్ని కులాలు ఉంటారని, అయినా తనపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ నియోజక వర్గం కాబట్టే హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌సిసి నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుప్పంకు నీరు వెళుతున్నా తమకు మాత్రం నీరు ఇవ్వకూడదని భావిస్తున్నారన్నారు.
ఎస్సీ మహిళను కాబట్టే అందరికి అణిగిమణిగి ఉండాలన్నట్టు భావిస్తున్నారని, తాను ఏమైనా మాట్లాడితే తప్పన్నట్లు వ్యవహిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో నీటి కోసం తాను ఎన్నోసార్లు పోరాాడాల్సి వచ్చిందని విమర్శించారు.