Where Is YCP: వరద సహాయక చర్యల్లో కానరాని వైసీపీ, మళ్లీ బెంగుళూరు వెళ్ళిపోయిన జగన్
Where Is YCP: విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తి వారం రోజులవుతోంది. ఇప్పటికీ సగం నగరం వరద ముంపులోనే ఉంది. విజయవాడతో పాటు రూరల్ మండలాల ప్రజలు ఆహారం, తాగునీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడు లేని విపత్తును జనం ఎదుర్కొంటున్న వేళ ప్రధాన ప్రతిపక్షం బయటకు రాకపోవడం చర్చగా మారింది.
Where Is YCP: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నాయకులు వరద సహాయక చర్యల్లో ఎక్కడా కానరావడం లేదు. కార్పొరేటర్లు మొదలుకుని మాజీ ఎమ్మెల్యేల వరకు ఒక్కరు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. పాతబస్తీలో ఒకరిద్దరు సొంతంగా సహాయ చర్యలు అందిస్తున్నా మిగిలిన వాళ్ల జాడ లేకపోవడం ఆ పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది.
బుడమేరు వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. నగరంలోని సగం జనాభా బుడమేరు వరద ముంపుకు గురయ్యారు. విజయవాడ నగరానికి ఓ వైపునున్న ప్రజలు కృష్ణా నది తాకిడికి గురయ్యారు. కృష్ణా వరద తగ్గుముఖం పట్టడంతో రెండు మూడు రోజుల్లోనే వారంతా ఊపిరి పీల్చుకున్నా బుడమేరు సమస్య మాత్రం ఓ పట్టాన కొలిక్కి రాలేదు. వారం రోజులుగా ఊళ్లకు ఊళ్లు ముంపులోనే ఉన్నాయి. విజయవాడ నగరంలోని పలు డివిజన్లలో ఇంకా రెండు, మూడు అడుగుల ఎత్తున వరద నీరు ఉంది. వరద ప్రవాహం తగ్గిన ముంపు వీడటం లేదు.
వరద ఉధృతి తగ్గినా నగరంలోని పలు ప్రాంతాల్లో వినియోగించే మురుగు నీరు డ్రెయిన్ల ద్వారా ఔట్‌ఫాల్ మార్గాల్లో బుడమేరులోకి వెళ్లాలి. బుడమేరులో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో నగరంలో ముంపు కూడా తగ్గు ముఖం పట్టడం లేదు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై కట్టుబట్టలతో బయటపడాల్సి వచ్చింది.
పరామర్శలకు పరిమితం...
విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్‌లో వైసీపీ అధికార పక్షంగా ఉంది. నిన్నటి వరకు విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజక వర్గాలతో పాటు మైలవరంలో కూడా వైసీపీ అధికారంలో ఉంది. ఎన్నికల్లో ఓటమి పాలై మూడు నెలలు గడువక ముందే వచ్చిన వరదల్లో వైసీపీ నాయకులు ఎవరు ప్రజలకు కనిపించడం లేదు. వైసీపీకి గట్టి పట్టున్న విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పత్తా లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన నాయకులు ప్రజలకు దొరక్కుండా తిరుగుతున్నారు.
రెండ్రోజుల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ పాతరాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. విజయవాడ పశ్చిమ అభ్యర్థి అసిఫ్‌తో పాటు కొందరు కార్పొరేటర్లు జగన్‌తో పాటు ఉన్నారు. జగన్ పరామర్శించిన వరద బాధితుల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లు ఉన్నారు. వారితోనే జగన్ మాట్లాడేలా స్థానిక నేతలు ముందస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంట పాటు జగన్ వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులతో గడిపారు.
గత ఆదివారం తెల్లవారుజాము నుంచి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం, సెంట్రల్ నియోజక వర్గాలను వరద ముంచెత్తిన తర్వాత స్థానిక కార్పొరేటర్లు ఎవరు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. గురువారం జగన్ పర్యటించే వరకు ఎక్కడి నాయకులు అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువకులు మాత్రమే బాధితుల్ని ఆదుకోడానికి ప్రయత్నించారు. చాలా ప్రాంతాల్లో నేటికి వరద సాయం పూర్తి స్థాయిలో చేరడం లేదు.ఈ క్రమంలో వైసీపీ క్యాడర్ ఎక్కడా వరద సహాయక చర్యల్లో పాల్గొనక పోవడం, ఆ పార్టీ నాయకులు కూడా చొరవ చూపకపోవడం చర్చలకు దారి తీస్తోంది.
అరెస్టుల భయం...
వైసీపీ ముఖ్య నాయకుల్లో చాలామందిని అరెస్టుల భయం వెంటాడంతో బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటే తమను కూడా వేధిస్తారనే భయం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ వరద బాధితుల్ని పరామర్శించిన రోజే ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో జగన్ పర్యటనలో కూడా నాయకులు పెద్దగా పాల్గొనలేదు.
మళ్లీ బెంగుళూరు వెళ్లిన జగన్...
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ గురువారం ఉదయం బెంగుళూరు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన బెంగుళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు విజయవాడలో వరదలు ముంచెత్తిన సమయంల పార్టీ నాయకులు ఎవరు పార్టీ సానుభూతి పరులకు అందుబాటులో లేకపోవడం, సాయం అందించే ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పు పార్టీ కార్యకర్తలు పడుతున్నారు..