Ongole Chevireddy: ఒంగోలు వైసీపీ టిక్కెట్ చెవిరెడ్డికే.. నేడోరేపో ప్రకటన!-ycp decision to give ongole parliament ticket to chevireddy bhaskar reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ongole Chevireddy: ఒంగోలు వైసీపీ టిక్కెట్ చెవిరెడ్డికే.. నేడోరేపో ప్రకటన!

Ongole Chevireddy: ఒంగోలు వైసీపీ టిక్కెట్ చెవిరెడ్డికే.. నేడోరేపో ప్రకటన!

Sarath chandra.B HT Telugu
Feb 01, 2024 11:23 AM IST

Ongole Chevireddy: వైసీపీలో ఒంగోలు పార్లమెంటు టిక్కెట్‌ కేటాయింపుపై నెలకొన్న ప్రతిష్టంభన వీడిపోయింది. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

ఒంగోలు లోక్‌సభ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
ఒంగోలు లోక్‌సభ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

Ongole Chevireddy: ఒంగోలు లోక్‌సభ నియోజక వర్గ అభ్యర్థిత్వంపై వైసీపీలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. బాలినేని బెట్టు వీడటంతో ఎంపీ అభ్యర్ధి విషయం కొలిక్కి వచ్చింది.

yearly horoscope entry point

ఒంగోలు లోక్‌సభ అభ్యర్ధిత్వం కోసం ముఖ్యమంత్రి జగన్‌ బంధువర్గంలోనే తీవ్ర పోటీ ఏర్పడింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని వైసీపీ అధ్యక్షుడు భావించారు. గత కొద్ది రోజులుగా మాగుంటతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేందుకు జగన్‌ విముఖత వ్కక్తం చేశారు.

మరోవైపు ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసే విషయంలో వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి కుటుంబాల మధ్య పోటీ నెలకొంది. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డికి 2019లో టిక్కెట్ దక్కలేదు. మరోసారి పోటీ చేయాలని భావించినా ఆయనకు అవకాశం దక్కలేదు. బదులుగా ఆయన్ని టీటీడీ ఛైర్మన్‌ చేశారు.

2019లో ఒంగోలు నుంచి గెలుపొందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత ఏడాది ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చిక్కుకోక ముందు నుంచి ముఖ్యమంత్రితో దూరం పెరిగింది. మాగుంట కుటుంబ వ్యాపారంలో భాగంగా డిస్టిలరీ వ్యాపారాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి.

మద్యం బ్రాండ్లు, డిస్టిలరీల విషయంలో మాగుంటతో పార్టీకి దూరం పెరిగినట్టు ప్రచారం ఉంది. లిక్కర్‌ స్కామ్‌లో మాగుంట కుటుంబ సభ్యుల పేర్లు వెలుగు చూసిన తర్వాత ఇది మరింత పెరిగింది. దాదాపు రెండేళ్ల క్రితమే మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించాలని భావించారు.

ఒంగోలులో పోటీ చేయడానికి తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, వైసీపీ తరపున పోటీ చేసే విషయంలో స్పష్టమైన హామీ దక్కకపోవడంతో మాగుంట కూడా కినుక వహించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో మాగుంట కుటుంబ సభ్యుల పేర్లు వెలుగు చూడటంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. దీనికి తోడు ప్రత్యర్ధులపై రాజకీయంగా విమర్శలు గుప్పించే విషయంలో సిఎంఓ సూచనల్ని మాగుంట పట్టించుకోలేదు. దీంతో ఆయనకు టిక్కెట్ దక్కలేదని ప్రచారం జరిగింది.

మరోవైపు మాగుంటకు టిక్కెట్‌ కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. మాగుంటకు టిక్కెట్‌ ఇవ్వకపోతే తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి కూడా వైసీపీ అధిష్టానం తలొగ్గలేదు. వైవీ సుబ్బారెడ్డి సైతం తన కుమారుడు విక్రాంత్‌ రెడ్డితో ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయించాలని ఓ దశలో భావించారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని కుటుంబాల మధ్య వివాదాలతో అక్కడ పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని భావించిన జగన్మోహన్ రెడ్డి చివరకు చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు.

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి ప్రకాశం వైసీపీ నేతలు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. sa

Whats_app_banner