Visakha Washing Machines Cash: వాషింగ్ మెషిన్లలో భారీగా నగదు పట్టుకున్న పోలీసులు
Visakha WashingMachines Cash: విశాఖలో అక్రమంగా తరలిస్తున్న నగదును ఎన్‌ఏడి జంక్షన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి వాషింగ్ మెషిన్లలో దాచి రవాణా చేస్తున్న కోటి నలభై లక్షలు సీజ్ చేశారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Visakha WashingMachines Cash: విశాఖలో పెట్రోలింగ్ పోలీసుల తనిఖీల్లో కళ్లు చెదిరే క్యాష్ బయటపడింది. విశాఖ నుంచి విజయవాడకు హవాలా మార్గంలో రవాణా చేస్తున్న క్యాష్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎన్‌ఏడి జంక్షన్‌లో రాత్రి తనిఖీలు చేపట్టిన పోలీసులకు వాషింగ్ మెషిన్ల లోడుతో వెళుతున్న వాహనం అనుమానాస్పదంగా కనిపించింది.
వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయడంతో అట్టపెట్టెల్లో పెట్టిన నగదు బయట పడింది. వాషింగ్ మెషిన్లను విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్నట్లు గుర్తించారు. అట్టపెట్టెల్లో ఉన్న నగదు కోటి 40లక్షలు ఉంటుందని లెక్కించారు. విజయవాడకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణం నుంచి వాషింగ్ మెషిన్లను పంపినట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల మాటున హవాలా నగదు లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులకు ముందస్తు సమాచారం అందినట్టు తెలుస్తోంది.
అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంపై ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో నగదుతో పాటు వాషింగ్ మెషిన్లను రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. వాహనంలో ఉన్న 30సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.పన్ను ఎగవేత నుంచి తప్పించుకోడానిక వాషింగ్ మెషిన్లో నగదు పంపారా మరేదైనా కారణం ఉందా అని పోలీసులు అరా తీస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు.
టాటా ఏస్ వాహనంలో ఆరు వాషింగ్ మెషిన్లను తరలిస్తుండగా పోలీసులు వాటిని తనిఖీ చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నగదు తరలింపుపై సరైన ఆధారాలు చూపించక పోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగదును విజయవాడకు తరలిస్తున్నట్లు గుర్తించారు.