Michaung Cyclone: ఏపీపై మిచౌంగ్ తుపాను ప్రభావం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు-అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్-vijayawada news in telugu michaung cyclone effect on ap cs jawahar reddy alerted collectors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Michaung Cyclone: ఏపీపై మిచౌంగ్ తుపాను ప్రభావం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు-అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

Michaung Cyclone: ఏపీపై మిచౌంగ్ తుపాను ప్రభావం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు-అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

Bandaru Satyaprasad HT Telugu
Dec 02, 2023 06:17 PM IST

Michaung Cyclone : నెల్లూరు-మచిలీపట్నం మధ్య సోమవారం మిచౌంగ్ తుపాను తీరం దాటే అవకాశం ఉందని సీఎస్ తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఏపీపై మిచౌంగ్ తుపాను ప్రభావం
ఏపీపై మిచౌంగ్ తుపాను ప్రభావం

Michaung Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ... భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడండి

రానున్న మూడు రోజులు మత్స్యకారులు ఎవరినీ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లనీయవద్దని, ఒకవేళ ఇప్పటికే ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే వారు త్వరగా ఒడ్డుకు చేరేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లకు స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని చెప్పారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్టు సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఎంత ధాన్యం ఉంది వెంటనే వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ను సీఎస్ ఆదేశించారు. అదే విధంగా కోతకోసి పనలపై ఉన్న వారి పంటను ఏవిధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచండి

వివిధ నిత్యావసర సరకులను జిల్లాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరణకు అవసరమైన పవర్ షాలు, కట్టర్లు, జేసీబీలు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్ అండ్ బీ, విద్యుత్, టెలికాం తదితర శాఖలను సీఎస్ ఆదేశించారు.

ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు.

Whats_app_banner