Road Accident : అల్లూరి జిల్లాలో విషాదం.. కుమార్తెను చూడటానికి వెళ్లిన తండ్రి, లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన వ్యక్తి మృతి
Road Accident : అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న కుమార్తెను చూడటానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన వ్యక్తి.. లిఫ్ట్ అడిగి అదే వాహనంపై ఎక్కిన మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో రెండు నిమిషాల్లో గమ్యానికి చేరేలోపే మృత్యువు కబళించింది.
అల్లూరి సీతారామ రాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన అంబటి అప్పలస్వామి (38).. రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె రేష్మను చూడటానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో కాకరపాడు వద్ద.. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడిగుమ్మల పంచాయతీ ఎరకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజుబాబు (60) లిఫ్ట్ అడిగి బైక్‌పై ఎక్కారు.
రావణాపల్లి సమీపంలో 516 ఈ జాతీయ రహదారిపై.. కృష్ణదేవిపేట నుంచి అతివేగంగా రాంగ్ రూట్‌లో వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి రాజుబాబు జాతీయ రహదారికి కొంతదూరంలోని జీడిమామిడితోటలో ఎగిరిపడ్డారు. ఆసుపత్రికి తరలించే లోపు ఆయన మృతి చెందారు. తీవ్ర గాయాలైన అప్పన్న, కారులో ఉన్న కె. నాగేశ్వరరావులను 108 అంబులెన్స్‌లో కృష్ణదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ అప్పన్నకు ప్రథమ చికిత్స అందించి, అనంతరం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిగస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.
కారులో ఉన్న జ్యోతికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్‌ను స్థానికులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన అప్పన్నకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. రాజేంద్రపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజుబాబు గ్రామం ఎరకంపేటలో కూడా విషాదం నెలకొంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో..
పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరకు గాయాలు అయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని ఆగంగూడకు చెందిన బి. దుర్గారావు (49).. దొంబిడిలోని విశ్వవాణి చర్చిలో పాస్టరుగా పని ఉన్నారు. ఆయన భార్య యేమిరి అంగన్‌వాడీ కార్యకర్త. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులిద్దరూ బైక్‌పై చర్చికి వెళ్తున్నారు.
ఇదే సమయంలో ఆవిరిమానుగూడకు చెందిన బి.శ్రీను (22).. తన స్నేహితుడితో ద్విచక్రవాహనంపై తిత్తిరి గ్రామానికి వెళ్లి తిరిగి ఎదురుగా వస్తున్నారు. బల్లేరుగూడ కూడలి వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. దుర్గారావు, శ్రీను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు తీవ్ర గాయలతో పడి ఉన్నారు. వీరిని మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్ఐ నీలకంఠరావు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీను తండ్రి గతంలోనే మృతి చెందారు. దీంతో శ్రీను తల్లికి అండగా ఉంటూ.. గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. సీతంపేట మండలంలోని మండ గ్రామానికి చెందిన స్నేహితుడు ఆవిరిమానుగూడ గ్రామానికి శ్రీను వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి బైక్‌పై తిత్తిరి గ్రామానికి వెళ్లి, తిరిగి వచ్చే సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీను మృతి విషయం తెలుసుకున్న తల్లి గుండెలవిసేలా రోధించారు. దుర్గారావు మృతితో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. దుర్గారావు, శ్రీను మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)