Anakapalle : సాగునీటి కోసం కత్తులతో దాడి.. భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు
Anakapalle : అనకాపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. సాగునీటి కోసం బంధువుల మధ్య వివాదం నెలకొంది. అది కాస్తా కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం శ్రీరాంపురం గ్రామంలో బుధవారం ఘోరం జరిగింది. శ్రీరాంపురం గ్రామంలో చిటెకెల తాతీయలు, రుత్తల అబ్బులు అలియాస్ రామకృష్ణ, వరలక్ష్మి దంపతులకు భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు తన పొలానికి నీరు రాకుండా అడ్డుకట్ట వేయడం, భారీ వర్షాలప్పుడు కాలువ తీసి నీటిని తన పొలంలోకి వదిలేయడంతో పంట దెబ్బతింటోందని.. తాతీయలు ఆరోపిస్తున్నారు. తాము అలా చేయటం లేదని రామకృష్ణ, వరలక్ష్మి అంటున్నారు. ఇలా రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి వద్ద ఇరు కుంటుబాల మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్తా పెరిగి పెద్ద ఘర్షణగా మారింది. దీంతో ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగారు. అది కాస్తా కత్తిపోట్లకు దారి తీసింది. రామకృష్ణ ముందుగా కత్తితో తాతీయలుపై దాడి చేశాడు. రామకృష్ణ వద్ద కత్తిని తాతీయలు లాక్కొని, రామకృష్ణ, ఆయన భార్య వరలక్ష్మిపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య భర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు రామకృష్ణ, వరలక్ష్మి (45)ను నర్సీపట్నం తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ వరలక్ష్మీ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రేవతమ్మ తెలిపారు.
భార్య మందలించిందని..
విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య మందలించిందని భర్త బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వైజాగ్‌లోని వాంబేకాలనీలో 19వ బ్లాక్‌లో కొట్యాడ అప్పారావు (62) నివాసం ఉంటున్నాడు. భార్య ఈశ్వరమ్మ ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆయాగా పని చేస్తోంది. అప్పారావు నిత్యం తాగి ఇంటికి వస్తూ ఉంటాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తాగి వచ్చిన భర్తను ఈశ్వరమ్మ మందలించింది.
దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చేస్తాడులే అనుకుని, ఈశ్వరమ్మ నిద్ర పోయింది. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో జీవీఎంసీ నీటి కోసం లేచి చూడగా.. వారు నివసిస్తున్న బ్లాక్‌కి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకుని భర్త కనిపించాడు. దీంతో ఈశ్వరమ్మ కన్నీరుమున్నీరు అయింది. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)