Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఫిబ్రవరి కోటా దర్శనం టికెట్లు విడుదల
Tirumala Tickets : వచ్చే ఏడాది ఫిబ్రవరి కోటా దర్శనం, గదుల టికెట్లపై టీటీడీ అప్ డేట్ ఇచ్చింది. నేటి నుంచి దర్శనం టికెట్లను క్రమంగా విడుదల చేయనున్నారు. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. ఈ నెల 20 వరకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీపై టీటీడీ అలర్ట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు నేటి నుంచి విడుదల అవుతున్నాయి. తిరుమల వెళ్లే భక్తులు టీటీడీ అధికారి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in , యాప్ లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.
21న వర్చువల్ సేవ టికెట్లు విడుదల
శ్రీవారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా వర్చువల్ సేవల టికెట్లు, దర్శన స్లాట్లను నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెల అంగప్రదక్షిణం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. నవంబర్ 23న ఉదయం 11 గంటలకు ఫిబ్రవరి కోటా శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల చేస్తారు.
ఈ నెల 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి కోటా గదుల టికెట్లు నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ టికెట్లు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ టికెట్లు, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఇవాళ తిరుపతిలో కార్తీక మహా దీపోత్సవం
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని టీటీడీ కోరుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు. కార్తీక దీపోత్సవంలో మహిళలు కూర్చుని దీపాలు వెలిగించేలా దీపపు దిమ్మెలు, నేతి వత్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వద్ద తులసి మొక్కను ఉంచనున్నారు. కార్యక్రమం అనంతరం మహిళలకు ఈ మొక్కలను అందిస్తారు. వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మహాలక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనం