Tirumala Garuda Seva : రేపే శ్రీవారి గరుడ సేవ.. ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala Garuda seva : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రేపు గరుడ సేవను నిర్వహించనున్నారు. ఇందు కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ మలయప్ప స్వామి.. విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు.
తిరుమల కొండపై మంగళవారం శ్రీవారి గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులకు.. సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తారు. వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు.
రెండు రోజులు బైక్‌లకు నో ఎంట్రీ..
భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఈ పాయింట్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అక్టోబరు 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబరు 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు రద్దు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది.
పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్..
దాదాపు 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా ఆర్‌టీసీ బస్సుల్లో 3 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్‌టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్ కోడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
తిరుమలలోని బాలాజీనగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభాగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు, వినాయక నగర్ క్వార్టర్స్, నెహ్రూ మున్సిపల్ పార్కు, భారతీయ విద్యాభవన్, దేవలోక్, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ఉంటుంది.
28 భారీ స్క్రీన్లు..
భక్తులు గరుడసేవను వీక్షించేందుకు మాడవీధులు, మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రంభగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ హెచ్‌డీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గరుడ సేవను పర్యవేక్షించేందుకు 1,250 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, 5 వేల మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
అన్నప్రసాదం, తాగు నీరును భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, వెలుపలి ప్రదేశాలలో భక్తులకు సేవలు అందిస్తారు. భక్తులకు వైద్య సేవల కోసం మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లు, 12 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండి ఉన్నాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని ఆదివారం 86,859 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,173 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ఆదాయం రూ.3.64 కోట్లు వచ్చింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)