Tirumala VIP Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల జారీ తిరిగి ప్రారంభం
Tirumala VIP Darshan Tickets : ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీటీ తిరిగి ప్రారంభించింది. సోమవారం నుంచి సిఫార్సు లేఖల మీద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు.
Tirumala VIP Darshan Tickets : తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను తిరిగి ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమలుతో గత నెలలో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల సిఫార్సు లేఖలు నిలిపివేశారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి టీటీడీ ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఈసీ సానుకూలంగా స్పందించడంతో నిన్నటి నుంచి బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు రోజుకు పది వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు 10, ఎమ్మెల్యేలకు 6, ఎంపీలకు 12 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తారు.
అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల కలకలం
అలిపిరి మెట్ల మార్గంలో సోమవారం రెండు చిరుతలు భక్తులు చూసి కేకలు వేశారు. దీంతో చిరుతలు అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటలు పట్టింది. 36,146 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.4.40 కోట్లు. భక్తులు వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు నిడిపోయి ఏటీసీ వద్ద వరకూ క్యూలైన్ లో వేచిఉన్నారు.
మే 23న వైశాఖ పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో మే 23న వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారి దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్
ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఇటీవల విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ డిప్ టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మే 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు
సంబంధిత కథనం