Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..-huge crowd at tirumala continues to be heavy on this weekend free darshan is taking around 24 hours ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Maheshwaram Mahendra Chary HT Telugu
May 19, 2024 09:48 AM IST

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు వేసవి సెలవుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ

Tirumala Updates : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వేసవి సెలవులకు తోడు వీకెండ్ కావటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి ఉన్నాయి. దాదాపు 3 కి.మీ మేర బారులు తీరారు.

ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. శనివారం తిరుమల శ్రీవారిని 50,599 భక్తులు దర్శించుకున్నారు. రూ. 3.28 కోట్లు హుండీ కానుకులు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.

వైభవంగా పద్మావతీ పరిణయోత్సవాలు…

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవగంగా సాగుతున్నాయి. పరిణయోత్సవంలో రెండవ రోజైన శనివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయమారుతం, మధ్యమావతి, యమునా కల్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా ఆలపించారు. తరువాత హరికథ, నృత్యం, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది. ఇవాళ్టితో ఈ వేడుకులు పరిసమాప్తం కానున్నాయి.

శ్రీవారి దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్…..

ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా శనివారం విడుదలయ్యాయి. ఇక ఎలక్ట్రానిక్ డిప్ టికెట్లు  మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొంది.

  • వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 21న అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
  • ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.
  • శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
  • వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.
  • ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
  • తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
  • మే 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుదల చేస్తారు. ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు

 

 

Whats_app_banner