Tirumala Hundi Collection : తిరుమల చరిత్రలో ఇదే ఎక్కువ హుండీ ఆదాయం
Tirumala Tirupati Devasthanam : శ్రీవారి దర్శనానికి ఆగస్టు నెలలో భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ కారణంగా హుండీ ఆదాయం కూడా రికార్డు బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం.. ఆరు నెలలకుపైగా హుండీ ఆదాయం రూ.100 కోట్ల వరకు వచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి రికార్డు స్థాయిలో రూ.140.34 కోట్ల హుండీ వసూళ్లు వచ్చినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల చరిత్రలో ఇప్పటివరకు ఇదే ఎక్కువ అని వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా హుండీ ఆదాయం వచ్చిందని, ఇదే అత్యధికమని అన్నారు.
ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా శ్రీవారికి ఆదాయం వచ్చిందని ప్రకటించారు. ముఖ్యంగా మే నెలలో హుండీ వసూళ్లు రూ.130.29 కోట్లు, జూన్‌లో రూ.123.76 కోట్లు, జూలైలో రూ.139.46 కోట్లుగా ఉంది. ఇక ఆగస్టులో రూ.140.34కు చేరింది. దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య 22.22 లక్షలు కాగా, లడ్డూల విక్రయాలు కోటి దాటాయని, 47.76 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని అధికారులు చెబుతున్నారు. 10.85 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసినట్లు వెల్లడించారు.
వరుస సెలవులు రావడం, శ్రావణ మాసం కావడంతో ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా హుండీ ఆదాయం వచ్చింది. గత నెలలో రోజుకు సగటున 71 వేల మందికిపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో భాగంగానే.. ఆగస్టు నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ.140.34 కోట్లకు చేరింది.
మరోవైపు రెండేళ్ల తర్వాత ఈ నెల 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుమల మాడవీధుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వాహనసేవ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా గతంలో బ్రహ్మోత్సవాలు మాడ వీధుల్లో జరగలేదన్న సంగతి తెలిసిందే. ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో సామాన్య భక్తులకు మేలు జరిగేలా మాత్రమే సర్వదర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
సెప్టెంబర్ 26 న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ
సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం.
సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనం.
సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం.
సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం.
అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.
అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనం.
అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనం.
అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజారోహణ సేవలు ఉంటాయి.