Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన-tirumala devotees found centipede found in annaprasadam ttd denied allegations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Oct 05, 2024 09:34 PM IST

Tirumala Food : తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా అవాస్తమని టీటీడీ పేర్కొంది. జెర్రి రూపు చెదరకుండా ఉండటాన్ని చూస్తుంటే సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా భావించాల్సి ఉందని టీటీడీ తెలిపింది.

తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన
తిరుమల అన్నప్రసాదంలో జెర్రి, అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ ప్రకటన

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి పడిందని ఓ భక్తుడు ఆరోపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం అని టీటీడీ తెలిపింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు అవాస్తమని పేర్కొంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలను తయారుచేస్తారు. అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరమని టీటీడీ తెలిపింది.

అవాస్తవాలను నమ్మొద్దు

ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారని, అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రి ఉండటం అనేది పూర్తిగా కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తుందని టీటీడీ తెలిపింది. దయచేసి భక్తులు ఇటువంటి అవాస్తవాలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

గొడుగుల ఊరేగింపులో బహుమతులు ఇవ్వొద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ మాడవీధుల్లో గొడుగు ఊరేగింపు సమయంలో ఎలాంటి బహుమతులు ఇవ్వవద్దని టీటీడీ భక్తులకు సూచించింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 8న గరుడ వాహన సేవలో అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగు ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు సమర్పించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు ఇచ్చే కానుకలు శ్రీవారికి అందవని టీటీడీ పేర్కొంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి తిరుమలకు ఊరేగింపుగా గొడుగులను తీసుకొచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. ఊరేగింపుగా తీసుకొచ్చిన ఈ గొడుగులు అక్టోబర్ 7న తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.

వీఐపీ సంస్కృతి తగ్గాలి - సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం ఉదయం టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో సమీక్ష చేశారు. ఇందుకు దేవదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.

వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు.

“లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి...మరింత మెరుగుపడాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి....అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి. తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి...ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి....ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం