TTD : టీటీడీకి ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించాల్సిందే.. కోర్టు ఆదేశం
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించాల్సిందేనని.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తం టీటీడీకి చెల్లించాలని స్పష్టం చేసింది. టీటీడీ తరపు న్యాయవాది కె.రాజేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.
టీటీడీకి సంబంధించిన ఆలయాల్లోని బంగారు ఆభరణాలకు.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ)లో ఇన్సూరెన్స్ చేయించారు. 2009లో తిరుపతిలోని శ్రీకోందరామస్వామి ఆలయంలోని నగలు దొంగతనానికి గురయ్యాయి. దీనిపై తిరుపతి పడమర పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో కొన్ని నగలు రికవరీ చేయగా.. ఇంకా కొన్ని నగలు రికవరీ చేయలేకపోయారు.
రీకవరీ చేయలేకపోయిన నగలు విలువ రూ.2,43,480గా గుర్తించారు. దీంతో నగలకు ఉన్న ఇన్సూరెన్స్ ప్రాతిపదికన టీటీడీ, డబ్బులు చెల్లించాల్సిందిగా యూఐఐసీని కోరింది. అయితే.. డబ్బులు చెల్లించేందుకు యూఐఐసీ నిరాకరించింది. దీంతో టీటీడీ తిరుపతి డిస్ట్రిక్ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించింది. కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన కన్స్యూమర్ కోర్టు.. యూఐఐసీ తీరును తప్పుపట్టింది. పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ పరిహారం రూ.2,43,480 టీటీడీకి యూఐఐసీ చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.
అంతేకాకుండా సర్వీస్ అందించడంలో యూఐఐసీ లోపానికి పాల్పడిందని పేర్కొంటూ.. సర్వీస్ లోపం కింద మరో రూ.లక్ష, ఫిర్యాదు దాఖలు ఖర్చులు మరో రూ.10 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. టీటీడీ తరపు న్యాయవాది కె.రాజేష్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ తీర్పును సెప్టెంబర్ 30న తిరుపతి డిస్ట్రిక్ కన్స్యూమర్ కోర్టు ఇచ్చిందని, తీర్పు ఇచ్చినప్పటి నుంచి 45 రోజుల్లో అంటే నవంబర్ 14 తేదీ లోపు టీటీడీకి మొత్తం రూ.3,53,480 యూఐఐసీ చెల్లించాల్సి ఉంటుందని లాయర్ వివరించారు.
యూఐఐసీ ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఈ కంపెనీ కస్టమర్స్‌గా.. ఓఎన్‌జీ లిమిటెడ్, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్, ముంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంటి ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఎప్పటి నుంచో టీటీడీ యూఐఐసీ కస్టమర్‌గా ఉంది. అయితే.. ఈ కేసు విషయంలో యూఐఐసీ తీవ్ర జాప్యం చేసింది. అంతేకాకుండా క్లైమ్ చేసేందుకు టీటీడీకి అనుమతి ఇవ్వలేదు. అందుకే టీటీడీ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)