Eluru : వరసకు చెల్లిలైన బాలికపై యువకుడు అత్యాచారం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
Summary: ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడి కేసులో.. పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యువకుడికి జీవితకాల జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమాన విధించింది. బాధితురాలికి నష్ట పరిహారం రూ.3 లక్షల చెల్లించాలని ఏలూరు పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.
Eluru : ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి ఠాణా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన చెమటపాము రమేష్.. 2014 ఫిబ్రవరి 7న వరసకు చెల్లిలైన బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం గ్రామం నుంచి పారిపోయాడు. బాధితురాలు తనను రమేష్ అన్నయ్య పాడుచేశాడని తల్లితో చెప్పింది. దీంతో వారు తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రమేష్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసును అప్పటి సీఐ దర్యాప్తు చేశారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయడంతో డీఎస్పీకి అప్పగించారు. డీఎస్పీ విచారణ జరిపి అన్ని ఆధారాలను కోర్టుకు అందజేశారు. ఈ కేసును పోక్సో చట్టం కోర్టు న్యాయమూర్తి ఎస్. ఉమా సునంద శుక్రవారం విచారణ జరిపారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించారు. నిందితుడు చేసిన నేరంపై అన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రాసిక్యూషన్ పీపీ డీవీ రామాంజనేయులు వాదనలతో సమ్మతించిన న్యాయమూర్తి ఎస్. ఉమా సునంద.. నేరం రుజువు అయిందని నిర్ధారించింది. దీంతో నిందితుడికి జీవితకాలం జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. అలాగే నిందితుడికి రూ.5 వేలు జరిమాన కూడా విధించారు. బాధిత బాలికకు మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ తీర్పుతో నిందితుడు జీవితకాలం జైలు శిక్ష అనుభవించనున్నారు. జీవితకాలమంటే 20 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష ఉంటుంది. ఆ తరువాత సత్ప్రవర్తన కింద విడుదల చేస్తుంది. లేకపోతే బెయిల్ దాఖలు చేసుకుని.. ఆయన ప్రవర్తన బాగుందని భావిస్తే.. కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. దాదాపు పదేళ్ల తరువాత బాధిత బాలికకు న్యాయం జరిగింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)