బియ్యపు బస్తా విషయంలో గొడవ.. బాలుడిని చంపిన వ్యక్తికి జీవిత కారాగార శిక్ష-boy murdered after dispute over rice bag killer sentenced to life imprisonment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బియ్యపు బస్తా విషయంలో గొడవ.. బాలుడిని చంపిన వ్యక్తికి జీవిత కారాగార శిక్ష

బియ్యపు బస్తా విషయంలో గొడవ.. బాలుడిని చంపిన వ్యక్తికి జీవిత కారాగార శిక్ష

HT Telugu Desk HT Telugu
Sep 03, 2024 10:33 AM IST

ఓ వ్యక్తి బియ్యం బస్తా విషయంలో గొడవ పడి, కక్ష పెంచుకుని ఓ బాలుడిని హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో హంతకుడికి జీవిత కాలపు కారాగార శిక్ష పడింది.

హంతకుడికి జీవితకాలపు కారాగార శిక్ష
హంతకుడికి జీవితకాలపు కారాగార శిక్ష (HT_PRINT)

పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని బాలుడిని హత్యచేసిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కుంటాల పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుంటాల మండలం రాజాపూరండాకు చెందిన చవాన్ సుధాకర్ ఎలాంటి పనీపాట లేకుండా జూలాయి గా తిరుగుతుండేవాడు.

2020 ఫిబ్రవరిలో గ్రామంలోని మద్యం దుకాణం వద్ద బియ్యం బస్తా విషయమై జాదవ్ సంజయ్ అనే వ్యక్తితో ఇతడికి వాగ్వాదం జరిగింది. పరస్పరం కొట్టుకున్నారు. అదేరోజు సాయంత్రం సంజయ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను దుర్భాషలాడి దాడికి పాల్పడ్డాడు. విషయం పంచాయితీకి చేరడంతో గ్రామపెద్దలు ఇరువురికీ సర్దిచెప్పారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబంలో ఎవరినైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటిముందు ఆడుకుంటున్న ఇతీష్ అనే బాలుడికి మాయమాటలు చెప్పి సమీపంలోని ఓ చేనుకు తీసుకెళ్లాడు. అక్కడ బండరాయితో అతడి ముఖంపై కొట్టి హత్యచేశాడు.

బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదుచేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పీపీ కల్వకుంట్ల వినోదరావు 13 మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంతో నేరస్థు డైన చవాన్ సుధాకర్‌కు జీవితకాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.కర్ణకుమార్ సోమవారం తీర్పునిచ్చారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు