TTD Chiarman: టీటీడీ ఛైర్మన్ పీఠం దక్కెదెవరికి? కొనసాగుతున్న ఉత్కంఠ.. తెరపైకి కొత్తపేర్లు…
TTD Chiarman: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి విడత జాబితా వారం రోజుల క్రితం విడుదలైనా కీలకమైన పోస్టుల భర్తీపై మాత్రం క్లారిటీ రావడం లేదు.రాష్ట్రంలో ముఖ్యమైన పదవులు ఎన్ని ఉన్నా అందరి దృష్టి మాత్రం టీటీడీ ఛైర్మన్ నియామకంపైనే ఉంది.
TTD Chiarman: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలై వారం గడుస్తోంది. గత వారం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, పాలక మండలి సభ్యుల్నినియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నాయకులు, పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి అనుభవం, సామర్థ్యానికి తగ్గ పోస్టుల్లో నియమించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, కీలకమైన పదవుల నియామకంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం గుర్తింపు ఉన్న పదవుల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ వీడటం లేదు. గత వారమే టీటీడీ ఛైర్మన్ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగినా చివరి నిమిషంలో అది ఆగిపోయింది. టీటీడీ ఛైర్మన్, పాలక మండలి సభ్యత్వాల కోసం కూటమి నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే కొన్ని పేర్లు విస్తృతంగా ప్రచారం జరిగినా టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో మాత్రం బయడ పెట్టడం లేదు.
టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న ప్రముఖుల్లో పలువురికి టీడీపీ బాధ్యులు వేర్వేరుగా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది కూడా టీటీడీ నియామకం కొలిక్కి రాకపోవడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో ఆలయ నిర్వహణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కల్తీ నెయ్యి వ్యవహారంతో తిరుమల వ్యవహారాలను ప్రక్షాళన చేయాలని కూటమి పార్టీలు బలంగా భావిస్తున్నాయి. మరోవైపు టీటీడీ బాధ్యతల్ని తమకు అప్పగించాలని బీజేపీ కోరినట్టు తెలుస్తోంది.
భారీగా ఆశావహులు…
టీటీడీ పాలక మండలి సభ్యత్వాల కోసం ఏకంగా ఆ పార్టీకి దాదాపు 250దరఖాస్తులు వచ్చినట్టు చెబుతున్నారు. టీటీడీ పాలక మండలిలో గరిష్టంగా 23మందికి మించి సభ్యులుగా నియమించే అవకాశం ఉండదు. జనసేన, టీడీపీల నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంది. ఓ దశలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా టీటీడీ ఛైర్మన్ రేసులో వినిపించింది. ఈ ప్రచారాలను పవన్ తోసిపుచ్చారు. నామినేటెడ్ పదవుల వ్యవహారంలో తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని మాత్రం పవన్ స్పష్టం చేశారు. టీటీడీ సభ్వత్వాలు, పదవులు కోసం తనను ఒత్తిడి చేయొద్దని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.
కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరుడి సన్నిధిలో జరుగుతున్న పరిణామాలను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో తిరుమల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరేలా అందరికి అమోద యోగ్యమైన వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ పదవిలో నియమించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లతో పాటు మరికొన్ని పేర్లను కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
టీటీడీ ఛైర్మన్ పదవికి గౌరవాన్ని తీసుకురావడంతో పాటు, పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారు, రాజ్యాంగ పదవుల్లో పని చేసిన అనుభవం ఉన్న వారిని కూడా టీటీడీ ఛైర్మన్ గా నియమించే అవకాశాలపై సన్నిహితులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. టీటీడీ నిర్వహణలో భక్తిభావం మాత్రమే ఉండాలి. రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదని ముఖ్యమంత్రి ఉద్దేశంగా ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షాలకు, రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా నియామకాలు లేకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులుగా ఉన్న ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నారు. గతంలో టీడీపీలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారు, సినీ ప్రముఖుల పేర్లను కూడా టీటీడీ ఛైర్మన్ పదవికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణల్లో భాగంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా పాలకమండలిలో ప్రాధాన్యత ఉండేలా పాలక మండలిని ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందే పాలకమండలిని ప్రకటిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.