APSRTC : ఓవైపు సెల్‌ఫోన్.. మరోవైపు బస్ డ్రైవింగ్.. ప్రయాణికుల ప్రాణాలంటే లెక్కలేదా?
APSRTC : తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కొందరు బస్ డ్రైవర్లు మారడం లేదు. మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ బస్ డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా బస్సును నడిపారని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆగస్టు 31న ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఆ సమయంలో పొదిలి నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సు బయల్దేరింది. అసలే వర్షం పడుతోంది. అటు ట్రాఫిక్ భారీగా ఉంది. ఇలాంటి సమయంలో ఓ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారు. దీంతో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించారు. ఈ ఘటన గతనెల 30న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పొదిలి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మస్తాన్ డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించారు. మస్తాన్ తరుచూ ఫోన్ చూస్తూ.. కాల్ మాట్లాడుకుంటూ బస్సును ప్రమాదకరంగా నడిపాడని ప్రయాణికులు చెప్పారు. ఫోన్ ఉపయోగించడం మానేసి డ్రైవింగ్‌పై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరినప్పటికీ.. డ్రైవర్ వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తమ భద్రత గురించి భయపడ్డారు.
మస్తాన్ ఫోన్ మాట్లాడుతూ.. చూస్తూ డ్రైవింగ్ చేసినప్పుడు ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ యూజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రమాదం..
రెండ్రోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు హైవేపై మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నాం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన ఆయన... సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అని భరోసా ఇచ్చారు.
మొగిలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.