Srisailam Cobra coiled Linga : శ్రీశైలంలో అద్భుత దృశ్యం, చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము- వీడియో వైరల్
Srisailam Cobra coiled Linga : శ్రీశైల క్షేత్రంలో అద్భుతమైన దృశ్యం భక్తులకు కనిపించింది. పాతాళగంగ చంద్రలింగాన్ని చుట్టుకుని పగడ విప్పిన నాగు పాము ప్రత్యక్షమైంది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Srisailam Cobra coiled Linga : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అద్భుత దృశ్యం భక్తులకు కనిపించింది. శ్రీశైలం పాతాళగంగ రోడ్డు మార్గం వజ్రమ్మ గంగమ్మ వెనుక ఉన్న చంద్ర లింగానికి చుట్టుకుని నాగు పాము ప్రత్యక్షమైంది. సోమవారం ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు పామును గమనించి వీడియోలు తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. శివుడి కంఠాభరణమైన నాగుపాము శివలింగాన్ని చుట్టుకుని ఉండడంతో భక్తులు భక్తి పారవశ్యంతో మొక్కుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో భక్తులు ఈ ఆలయానికి క్యూకట్టారు.
ఈ వీడియోను భక్తులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి ఈ వీడియోను ట్వీట్ చేశారు. "శ్రీశైలంలోని పాతాళ గంగలో అత్యద్భుతమైన కాంతిలో స్నానం చేసిన నాగుపాము చంద్రలింగం చుట్టూ చక్కగా చుట్టుకుని ఉన్న దివ్య దృశ్యానికి సాక్ష్యమిది. ఇటువంటి అరుదైన క్షణాలు హృదయాన్ని ప్రగాఢమైన భక్తితో నింపుతాయి" అని ట్వీట్ చేశారు.
ప్రపంచ పాముల దినోత్సవం
పాము అనే పదం వింటేనే భయమేస్తుంది. ఈ జీవిని చూస్తే ఎంత వింత సృష్టి అనిపిస్తుంది. పాములకు కూడా ఒక రోజు ఉంటుందని చాలా మందికి తెలియదు. ప్రపంచ పాముల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 16 న జరుపుకుంటారు. వివిధ జాతుల పాముల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ స్నేక్ డేను నిర్వహిస్తారు. 'స్నేక్' అనే పదం పాత 'స్నాగా' నుండి వచ్చింది. ఈ సరీసృపం సుమారు 174 మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న బల్లుల నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు. మానవులు ఆవిర్భవించక ముందే పాములు భూమిపై ఉండేవని నమ్ముతారు. 1967లో 'స్నేక్ ఫామ్' అనే సంస్థ ద్వారా ప్రపంచ పాముల దినోత్సవాన్ని తొలిసారిగా అమెరికాలో నిర్వహించారు.
పాములు ఆహార గొలుసులో ముఖ్యమైనవి, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చీడపీడలను నియంత్రిస్తాయి. వ్యవసాయ పొలాల్లో ఎలుకలను నియంత్రిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 3,500 జాతులకు పైగా పాములు ఉన్నాయి. వీటిలో 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కేవలం 200 జాతుల పాములు మాత్రమే మానవ ప్రాణాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. పాములు వైద్యంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పాములను సంరక్షించాల్సిన అవసరం ఉంది. గత 30 సంవత్సరాలలో ప్రపంచంలో పాముల సంఖ్య 10% తగ్గింది. అనేక పాము జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. పాము విషాన్ని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తున్నారని అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూలై 16న ప్రపంచ పాము దినోత్సవాన్ని జరుపుకుంటారు.
సంబంధిత కథనం