Southwest Monsoon Hits AP : ఏపీ వాసులకు చల్లటి కబురు, రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon Hits AP : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాలని ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Southwest Monsoon Hits AP : ఉక్కపోతతో ఉడికిపోతున్న ఏపీ వాసులకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీపంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ ప్రాంతాలపై విస్తరించి ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో చిరు జల్లులు పడే అవకాశాముందని ప్రకటించింది.
ఏపీలో తేలికపాటి వర్షాలు
కోస్తాంధ్ర, యానాంలో ఆదివారం, సోమవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే జల్లులు పడే అవకాశముందని, ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు రాగల మూడు రోజుల్లో వర్షసూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించడంతో...దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే నేడు, రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని స్పష్టం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో , సోమవారం ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.