Fake IAS Fraud: ఐఏఎస్‌నంటూ మోసంతో రెండో పెళ్లి, కోట్లు వసూలు చేసి భార్యకు వేధింపులు
Fake IAS Fraud: ఐఏఎస్ అధికారినంటూ బిల్డప్ ఇచ్చిన కేటుగాడు మ్యాట్రిమోనీలో పరిచయమైన యువతిని నిలువునా ముంచేశాడు. ముందే పెళ్లైందనే విషయం దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి కోట్లు వసూలు చేసిన తర్వాత నిజం బయటపడింది.
Fake IAS Fraud: రష్యాలో వైద్య విద్యాభ్యాసం చేసిన ఓ ప్రబుద్దుడు ఐఏఎస్ అవతరమెత్తి మ్యాట్రిమోనీ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి సంప్రదించిన యువతిని కర్ణాటక క్యాడర్ ఐఏఎస్‌నంటూ మోసం చేశాడు. రూ.50లక్షల కట్నం, ఆభరణాలు ఇచ్చి యువతి తల్లిదండ్రులు ఘనంగా వివాహం చేశారు. ఆ తర్వాత తనకు సివిల్ సర్వీస్ ఇష్టం లేదని, వైద్య వృత్తిలో కొనసాగుతానని మాయమాటలు చెప్పి ఉద్యోగం చేస్తున్నట్టు నటించాడు.
ఇలా ఏళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో అతడి తల్లి, సోదరి యువతి ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి జల్సాలు చేశారు. యువతిని అన్ని రకాలుగా మోసం చేసిన తర్వాత అసలు నిజం బయటపడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ముందు వెనుక విచారించకుండా ఐఏఎస్ అధికారినంటూ మ్యాట్రిమోనీలో చూసిన ప్రకటనతో ఓ యువతి మోసపోయింది. పెళ్లాయ్యక కూడా భార్యను నమ్మించి రూ.2 కోట్లు వసూలు చేశాడు. భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు.
కర్ణాటక క్యాడర్ ఐఏఎస్‌నని మోసం చేసి పెళ్లి చేసుకుని, పెళ్లైన తర్వాత వైద్య వృత్తంటే ఇష్టమంటూ రేడియాలజిస్ట్ అవతరంలో నటిస్తూ కాపురం చేసిన భర్త బండారం చివరకు బయటపడింది. భర్త చేసిన మోసాలు తెలిసినా సర్దుకుపోయిన బాధితురాలిని కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. విదేశాల్లో ఉంచిన డబ్బును ఐటీ అధికారులు ఫ్రీజ్ చేశారంటూ రెండు కోట్లు వసూలు చేశాడు. హైదరబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్‌కుమార్(38) కర్ణాటక ఐఏఎస్ క్యాడర్‌కు ఎంపికైనట్లు 2016లో ఊళ్లో ప్రచారం చేసుకున్నాడు. ఐఏఎస్ అధికారిగా పేర్కొంటూ మ్యాట్రీమోనీ సైట్‌లో వివరాలు ఉంచాడు. ఆ సమయంలో బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరిమిల్లి శ్రావణి(34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు.
నిందితుడి కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలతో 2018లో పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత తనకు ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పి రోజూ విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించేవాడు. ప్రస్తుతం మల్లంపేట గ్రీన్‌వాలీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఉద్యోగం చేసే సంపాదన గురించి ప్రశ్నిస్తే బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు ఫ్రీజ్ చేశారని నమ్మించాడు.రూ.40కోట్ల బ్యాంకులో ఉందని మభ్య పెట్టి ఆమె నుంచి రూ.2కోట్లు వసూలు చేశాడు. బాధితురాలు తన మిత్రుల దగ్గర డబ్బులు సేకరించి భర్తకు అప్పగించింది. ఆ డబ్బుల్ని నిందితుడు తండ్రి, సోదరి ఖాతాలకు మళ్లించాడు.
పెళ్లి సమయంలో ఇచ్చిన నగల్ని నిందితుడి తల్లి మాలతి బ్యాంకులో తాాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది. ఈ క్రమంలో భర్త, అత్తమామల వైఖరిపై అనుమానంతో బాధితురాలు అరా తీయడంతో అతను చెప్పినవన్నీ అసత్యాలుగా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత కట్నం కావాలంటూ ఆమెను వేధింపులకు గురి చేశారు. దీంతో బాచుపల్లి పోలీసుల్ని ఆశ్రయించింది.
ఐఏఎస్‌నంటూ మోసం చేసి పెళ్లి చేసుకున్న సందీప్‌కుమార్‌తో పాటు అతని తండ్రి విజయ్‌కుమార్(70), తల్లి మాలతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉంటున్న సోదరి మోతుకూరి లక్ష్మీసాహితి(35)పై కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అమెరికాలో ఉన్న నిందితురాలు లక్ష్మీసాహితీ కోసం లుకౌట్ నోటీసు జారీ చేస్తామని సీఐ తెలిపారు. మ్యాట్రిమోనీ సైట్లలో ప్రకటనలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.