Sajjala On MLC Elections : టీడీపీకి ఎవరు ఓటు వేశారో గుర్తించాం.. ఓటమిపై విశ్లేషిస్తాం
AP MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ నుంచి ఓట్లు పడ్డాయి. ఈ విషయం అధికార పార్టీకి షాక్ తగిలినట్టైంది. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్యై కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ(TDP)కి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరు అనేది గుర్తించినట్టుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి(sajjala ramakrishna reddy) చెప్పారు. తమకు అభ్యర్థులను గెలిపించుకునే.. సంఖ్యాబలం ఉందనే.. ఏడు సీట్లకు పోటీ పడినట్టుగా తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు(Chandrababu) ప్రలోభ పెట్టారని ఆరోపణలు చేశారు. లోపం ఎక్కడ ఉందో విశ్లేషించి.. చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుగుబాటు అయిన ఇద్దరు వైసీపీ(YCP) సభ్యులను పరిగణనలోకి తీసుకోలేదని సజ్జల పేర్కొన్నారు. తమ తరఫు నుంచి ఎక్కడ లోపం ఉందో.. విశ్లేషించుకుంటామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని అనుకోవట్లేదని సజ్జల స్పష్టం చేశారు. ఎవరైనా అసంతప్తిగా ఫీలైతే.. వారిని పిలిచి మాట్లాడుతామని వెల్లడించారు. అసంతృప్తిగా ఉంటే.. వెంటనే చర్యలు తీసుకునేందుకు ఇదేమీ ఉద్యోగం కాదని సజ్జల అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLA Quota MLC Elections) టీడీపీ అభ్యర్థి గెలుపుపై సమీక్ష చేసుకుంటామని మాజీ మంత్రి కన్నబాబు(Kannababu) అన్నారు. బాధ్యలు ఎవరైనా పార్టీ నుంచి చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ పార్టీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం.. ఆరు సీట్లు గెలుచుకున్నామన్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకునే విషయంపై జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గెలవటం కష్టం అనుకున్న సీటులో అభ్యర్థిని నిలబెట్టి ఎగరేసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నుంచి బరిలో ఉన్న పంచుమర్తి అనురాధ(panchumarthi anuradha)కు 19 ఓట్లే ఉంటే.. 23 ఓట్లు పడ్డాయి. ఇందులో రెండు ఓట్లు అధికార పార్టీ నుంచి వస్తాయని ముందే ఊహించినప్పటికీ... మరిన్ని ఓట్లు కూడా అనురాధకు పడటంతో వైసీపీ ఓ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఏడు స్థానాలే తమవే అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ.. ఓ సీటు కోల్పోవటం సంచలన పరిణామంగా మారింది. అసలు ఆ రెండు ఓట్లు ఎలా పడ్డాయి...? ఎవరు టీడీపీకి వేశారనే దానిపై చర్చించే పనిలో పడింది ఫ్యాన్ పార్టీ. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గుంటూరుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే టీడీపీకి ఓటు వేశారన్న చర్చ జోరుగా జరుగుతోంది.