TDP Hope on Victory: అసంతృప్తులపైనే టీడీపీ ఆశలన్నీ..అధికార పార్టీలో టెన్షన్-tdp is confident of winning the mla quota mlc elections in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Is Confident Of Winning The Mla Quota Mlc Elections In Andhra Pradesh

TDP Hope on Victory: అసంతృప్తులపైనే టీడీపీ ఆశలన్నీ..అధికార పార్టీలో టెన్షన్

HT Telugu Desk HT Telugu
Mar 23, 2023 07:48 AM IST

TDP Hope on Victory: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై తెలుగుదేవం పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. పార్టీ ఫిరాయించిన వారిని మినహాయిస్తే టీడీపీ అభ్యర్ధి గెలుపుకు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.వైసీపీలో అసంతృప్తులు టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న వారు గట్టెక్కిస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Hope on Victory: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలపై తెలుగుదేశం పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు అవసరమైనంత సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని పోటీలోకి దింపిందని వైసీపీ ఆరోపిస్తుంటే, అధికార పార్టీలో అసంతృప్తులే తమను గెలిపిస్తాయని టీడీపీ చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ.. అదే జోరుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని భావిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి సభలో 154 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ నుంచి సొంతంగా గెలిచిన 151మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆ పార్టీకి ఎదురు తిరిగారు.

నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి ఆత్మ సాక్షిగా ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ సొంతంగా 149మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒక్కో అభ్యర్థి గెలుపుకి 22మంది ఎమ్మెల్యేల బలం అవసరమవుతుంది. మొత్తం 154మంది ఎమ్మెల్యేల ఓట్లు వైసీపీకి అవసరం అవుతాయి.

టీడీపీ నుంచి గెలిచిన వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. రాపాక కూడా వైసీపీ వైపే ఉన్నా ప్రస్తుతం ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో తెలీదు. అటు టీడీపీకి సొంతంగా 19మందితో పాటు నెల్లూరు నుంచి కోటంరెడ్డి, ఆనం కూడా మద్దతిస్తున్నారు. గెలుపు కోసం మరొక్క ఓటు ఉంటే టీడీపీ సులువుగా గట్టెక్కుతుంది.

టీడీపీ నుంచి నలుగురిలో ముగ్గురు లేకుంటే వైసీపీ అంతృప్త ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుంది.

ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు….

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహం మీదున్న టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపైనా దృష్టి పెట్టింది.ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ ఎన్నికల బరిలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, టీడీపీ తరపున గెలిచి, ఆ తర్వాత వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్‌ జారీ చేసింది. ఓటు వేయడంలో ఎక్కడా పొరపాటు జరగకుండా ఇప్పటికే రెండు, మూడు సార్లు మాక్ పోలింగ్‌ నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం 9 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ మాక్‌ పోలింగ్‌ నిర్వహించిన తర్వాత ఉదయం 10 గంటలకు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లి ఓటు వేయనున్నారు.

రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కి హాజరు కాలేరని భావించారు. అనగాని కూడా బుధవారం విజయవాడకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లోను, అనంతరం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్న పార్టీలు…

పట్టభద్రుల నియోజకవర్గాల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలు మళ్లీ ఎదురవకుండా వైసీపీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. పోలింగ్‌ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసుకుంది. ఈ ఎమ్మెల్యేలంతా గురువారం పోలింగ్‌కు వచ్చి ఓటు వేసేలా బాధ్యతలను మంత్రులపై పెట్టారు.

ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాలనూ దక్కించుకోవాలంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కటి చేజారకూడదు. అన్ని ఓట్లు వైసీపీకే పడేలా చూడాలి. అవి చెల్లుబాటు కావాలి. పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారన్న అంచనాల నేపథ్యంలో, వైఎస్సార్సీపీ ఏడు స్థానాలనూ గెలవాలంటే టీడీపీ, జనసేన నుంచి గెలిచి, అధికార పార్టీకి మద్దతిచ్చిన అయిదుగురు ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారాయి.

టీడీపీ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి తమకు మద్దతుగా వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లను ఎలా పొందాలనే విషయంలో వైసీపీ కసరత్తు చేస్తోంది. వైసీపీలో అసంతృప్తి, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ వస్తుందో లేదో అన్న అనుమానం తదితర కారణాలతో కొంచెం దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తారనే అనుమానం ఆ పార్టీకి ఉంది. వైసీపీలో ఇలాంటివారు 8 నుంచి 10 మంది ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేల చొప్పున మొత్తం ఏడు బృందాలను వైకాపా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఈ బృందాలను సమన్వయం చేస్తున్నారు. వీరికి తోడు ఆ బృందాల్లో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులున్నారు. బృందంలోని ఎమ్మెల్యేలంతా పోలింగ్‌కు వచ్చి సరిగా ఓటేసేలా చూడటం ఈ మంత్రుల బాధ్యతే. అభ్యర్థులు కూడా ఈ బృందాలతోనే ఉంటున్నారు.

గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదని ప్రకటించిన ఆర్వో

గురువారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉన్నందున శాసనసభ, మండలి గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, శాసనమండలి సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డి తెలిపారు. శాసనసభ, మండలి సమావేశాల కవరేజీ నిమిత్తం మీడియా ప్రతినిధులు అసెంబ్లీ భవనం వద్దకు రావద్దని సూచించారు. సచివాలయం నాలుగో బ్లాకులోని పబ్లిసిటీ సెల్‌ నుంచి శాసనసభ, మండలి సమావేశాల లైవ్‌ కవరేజ్‌ అందించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కవరేజీ నిమిత్తం ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్‌లున్న మీడియా ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతిస్తామన్నారు.

IPL_Entry_Point