ట్రిపుల్ ఐటీల్లో దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. జూలై 1 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్
ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. ఈనెల 25తో గడువు ముగియనుంది. 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది.
రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25తో గడువు ముగియనుంది. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024-25 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ మే 6న విడుదల చేసింది.
మే 8 నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది. జూన్ 25న దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది. కాగా ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. జూలై 1 నుంచి ధ్రువీకరణ పత్రాలు ( ర్టిఫికేట్ల వెరిఫికేషన్) పరిశీలిస్తారు. జూలై 11న ఫలితాలు ప్రకటిస్తారు. జూలై మూడో వారంలో ప్రవేశాలు ప్రారంభం అవుతాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవల్సి ఉంటుంది. యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ rgukt.in లోనూ లేదా, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా సీట్లు, క్యాంపస్‌లు కేటాయిస్తారు. ఒకసారి సీటు, క్యాంపస్ కేటాయించిన తరువాత, వేరొక క్యాంపస్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉండదు.
కేటగిరిల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్
ట్రిపుల్ ఐటీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 1 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ప్రత్యేక కేటగిరీల వారీగా ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
- సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై 1 నుంచి 3 తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.
- స్ఫోర్ట్స్ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది.
- వికలాంగుల కోటా అభ్యర్థులకు జూలై 3న వెరిఫికేషన్ ఉంటుంది.
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థులకు జూలై 2,3 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.
- ఎన్‌సీసీ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ అధికార వర్గాలు తెలిపాయి.
జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 22, 23 తేదీల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ఒంగోల్ ట్రిపుల్ ఐటీలో 24, 25 తేదీల్లోనూ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 26, 27 తేదీల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలిస్తారు.
గతేడాది కంటే పెరిగిన దరఖాస్తులు
ఇప్పటి వరకు 50,106 దరఖాస్తు స్వీకరించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. అయితే ఇవి గతేడాది కంటే అధికమని పేర్కొన్నారు. గతేడాది 40 వేల దరఖాస్తులే రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 50,106 దరఖాస్తులు వచ్చాయి. అంటే దాదాపుగా పది వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇంకా రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దరఖాస్తు చేయడానికి అర్హులు ఎవరు?
ట్రిపుల్ ఐటీల్లో సీటు కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు మొదటి ప్రయత్నంలోనే 2024లో ఎస్ఎస్‌సీ పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలు, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, మున్సిపల్ హైస్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రెవేషన్ స్కోర్‌ను జోడించి సీటు కేటాయిస్తారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
వయస్సు
ట్రిపుల్ ఐటీ సీట్లకు కోసం అప్లై చేసిన వారికి ఆర్జీయూకేటీ వయస్సును కూడా నిర్ణయించింది. 2024 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్ళు నిండకుండా ఉండాలి.
సీట్లు ఎన్ని? కేటాయింపు ఎలా?
రాష్ట్రంలో ఉన్ననూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ట్రిపుల్ ఐటీల్లో 4,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక్కో ట్రిపుల్ ఐటీకి 100 సీట్లు చొప్పున, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో 85 శాతం సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లలో రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ సీట్లను ఏపి, తెలంగాణ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ఇందులో పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనునకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు 25 శాతం సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి.
రిజర్వేషన్ల అమలు ఇలా
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లను ఇలా అమలు చేస్తారు. ఎస్‌సీలకు 15 శాతం, ఎస్‌టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. బీసీల్లో 29 శాతంలో కూడా బీసీ-ఏకి 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేశారు.
వికలాంగులకు 5 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను కేటాయిస్తారు. అలాగే ప్రతి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయిస్తారు.
కోర్సులు
పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ కలిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యను అభ్యసించవచ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సులతో సమానంగా మాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్స్ ప్రత్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు ఉంటాయి.
ఫీజులు ఏలా?
ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు ఫీజులు ఇలా ఉంటాయి. పీయూసీకి ట్యూషన్ ఫీజు ఒక్కో ఏడాదికి రూ. 45 వేలు ఉంటుంది. బీటెక్ విద్యకు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ. 50 వేలు ఉంటుంది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ. 1.50 లక్షలు ఉంటుంది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు