AP SSC-Inter Supplementary: ఏపీలో ఎస్సెస్సీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం, రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ పరీక్షలు-ap ssc inter supplementary examinations start inter examinations in two sessions per day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc-inter Supplementary: ఏపీలో ఎస్సెస్సీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం, రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ పరీక్షలు

AP SSC-Inter Supplementary: ఏపీలో ఎస్సెస్సీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం, రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ పరీక్షలు

Sarath chandra.B HT Telugu
May 24, 2024 10:58 AM IST

AP SSC-Inter Supplementary: ఏపీలో ఎస్సెస్సీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి జూన్ 2 వరకు ఇంటర్, జూన్ 3వరకు ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీలో ఎస్సెస్సీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఏపీలో ఎస్సెస్సీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

AP SSC-Inter Supplementary: ఆంధ్రప్రదేశ్‌‌లో పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు పదో తరగతివ పరీక్షలు జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. రోజుకు రెండు విడతల్లో పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సెకండియర్ పరీక్షల్ని మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు నిర్వహిస్తారు.

ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 33 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. మరో 37 సున్నితమైన కేంద్రాలను కూడా ఇంటర్ బోర్డు గుర్తించింది.

ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,459మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్ధుల్లో 1,77,012 బాలురు, 1,69,381మంది బాలికలతో మొత్తం 3,46,393మంది పరీక్షలు రాస్తున్నారు. వీరితో పాటు ఫస్టియర్‌లో మరో 19,479మంది ఒకేషనల్ విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరవుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో 3,65,872మంది పరీక్షలు రాస్తున్నారు.

ఇంటర్ సెకండియర్‌లో 67,129మంది బాలురు, 54416మంది బాలికలతో 1,21,545మంది పరీక్షలు రాస్తున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో 9499 బాలురు, 6543 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,37,587మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌లలో కలిపి 5,03,459మంది ఇంటర్‌ పరీక్షలకు హాజరు కానున్నారు.

వేసవి నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలో ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగి విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులు అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సూచించారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉండనుంది. పరీక్షా కేంద్రాల వద్ద తలెత్తే ఇబ్బందులపై 08645-277702 ల్యాండ్ లైన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ 1800-4251531 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

పదో తరగతి పరీక్షలు ప్రారంభం…

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్సీ హాల్ టికెట్లను బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. అయితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.

685 పరీక్ష కేంద్రాలు

ఈ ఏడాది పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల నిర్వహణకు 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 685 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, 86 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 685 మంది చీఫ్‌ సూపరింటెండెంట్స్‌ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Whats_app_banner