Jagan Vs Revanth Reddy: ఆ విషయంలో రేవంత్‌ రెడ్డి.. జగన్‌ను దాటేశారా..!-revanth reddy who surpassed jaganmohan reddy in terms of media relations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Vs Revanth Reddy: ఆ విషయంలో రేవంత్‌ రెడ్డి.. జగన్‌ను దాటేశారా..!

Jagan Vs Revanth Reddy: ఆ విషయంలో రేవంత్‌ రెడ్డి.. జగన్‌ను దాటేశారా..!

Sarath chandra.B HT Telugu
Dec 29, 2023 12:02 PM IST

Jagan Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోనే ఓ విషయం జగన్‌ను దాటేశారు. నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేయలేని పనిని మూడు వారాల్లోనే రేవంత్ రెడ్డి అధిగమించేశారు.

రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి

Jagan Vs Revanth Reddy: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఓ విషయంలో అధిగమించేశారు. అది కూడా మూడు వారాల్లోనే ఆ పని పూర్తి చేసేశారు. ఇదేదో సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోకు సంబంధించిన విషయం కాదు. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చేయని, చేయకూడదని భావించే పనిని చాలా సునాయాసంగా పూర్తి చేసేశారు.

మూడు వారాల్లోనే టాస్క్ ఫినిష్…

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మూడు వారాల్లోనే ఓ పని పూర్తి చేశారు. నాలుగున్నరేళ్లలో రెండే రెండు సార్లు సిఎం హోదాలో జగన్‌ చేసిన పనిని రేవంత్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మీడియాతో ముఖాముఖి మాట్లాడే విషయంలో జగన్‌ను దాటేశారు. నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి రెండే రెండు సార్లు ప్రెస్‌మీట్‌లలో మాట్లాడారు. అవి కూడా కోవిడ్‌ సమయంలో మాత్రమే ఆయన మీడియాతో నేరుగా మాట్లాడారు.

2020 మార్చిరెండో వారంలో లాక్‌ డౌన్‌ ప్రకటించిన తర్వాత కోవిడ్ సన్నద్ధత మీద ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మాట్లాడారు. కోవిడ్‌కు భయపడాల్సింది లేదు పారాసెటిమాల్‌తో తగ్గిపోతుందని, బ్లీచింగ్‌తో నియంత్రించవచ్చని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత కూడా కోవిడ్‌ విషయంలోనే మరోసారి మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం, తాడేపల్లిలో సమీక్షలు, నవరత్నాల్లో భాగంగా నిధుల విడుదల కార్యక్రమాలు,విపత్తుల సమయంలో క్షేత్ర స్థాయి పర్యటనల్లో బహిరంగ వేదికల మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వస్తున్నారు. ఆ సమయంలో మాత్రమే తాను చెప్పాలనుకున్న విషయాలను వివరించే ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో విపక్షల విమర్శలకు పాలనా పరమైన లోపాలకు జవాబు ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా చేయలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ముఖ్యమైన సందర్భాల్లో మీడియాతో మాట్లాడేవారు. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టే వారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఒకటిరెండు సందర్భాల్లో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాను పూర్తిగా దూరం పెట్టేశారు.

ఆ విషయంలో రేవంత్ రెడ్డి పూర్తిగా భిన్నం...

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌ రెడ్డి మీడియాను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన వెంటనే సచివాలయంలోకి మీడియాను అనుమతించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీన తొలిసారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

డిసెంబర్ 27న మరోసారి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రకటించే సందర్భంగా మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ సమయంలో వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలో మీడియాకు అందుబాటులోకి వచ్చారు. పాత పరిచయాలతో అందరినీ పలకరించారు.

ముఖ్యమంత్రిగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో రెండు సార్లు అధికారికంగా మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రధానితో భేటీ తర్వాత కూడా కేంద్రాన్ని తాము ఏమి కోరామనేది వివరించారు. హైదరాబాద్‌లో సైతం మీడియాతో రెండు మూడు సందర్భాల్లో ఇష్టాగోష్టీ చర్చల్లో పాల్గొన్నారు. వారి నుంచి సూచనలు సలహాలు కోరుతున్నట్లు చెప్పారు.

సచివాలయంలో పూర్తి స్థాయిలో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం మీడియాకు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. మీడియాకు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఏపీలో మాత్రం నాలుగున్నరేళ్లో కనీసం ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. తన రాజకీయ ప్రస్థానంలో మీడియా సహకారం పెద్దగా లేదనే భావన ముఖ్యమంత్రిలో బలంగా ఉండటంతోనే వారికి దూరంగా ఉండిపోయారని సన్నిహితులు చెబుతారు. ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని, మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తుంటారని ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే అధికారులు చెబుతుంటారు.

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తొలిసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వారి వ్యవహార శైలి, మీడియాతో సంబంధాల విషయంలో వారి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.

Whats_app_banner