Police Notices For PK: రాళ్లదాడి అంటూ పవన్ వ్యాఖ్యలపై పోలీసుల నోటీసులు
Police Notices For PK: పవన్ కళ్యాణ్ పెడన పర్యటనలో రాళ్లదాడి చేయడానికి వైసీపీ ప్లాన్ చేసిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పవన్ తన వ్యాఖ్యలకు సాక్ష్యాలు చూపాలని ఎస్పీ జాషువా చెప్పారు.
Police Notices For PK: వారాహి యాత్రపై వైసీపీ నేతలు దాడికి పథక రచన చేశారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు నోటీసులు పంపినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ప్రకటనలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రౌడీలు, అసాంఘిక శక్తులు తన పబ్లిక్ మీటింగ్ డిస్ట్రబ్ చేస్తారనే ప్రకటనకు సాక్ష్యాలు ఏమిటని ఎస్పీ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలకు నమ్మకమైన సమాచారం ఉందా అనే దానిపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు మచిలీపట్నం డిఎస్పీ, పెడన సిఐలు నోటీసులు పంపారని వివరించాురు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు ఉన్న ఆధారాలు ఏమిటి, ఆ వ్యాఖ్యలు ఏ ఆధారంతో ఎలా చేశారు, ఎందుకు చేశారని ఎస్పీ ప్రశ్నించారు. ఆ సమాచారం పోలీసులకు చెబితే దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు చేసేటపుడు విశ్వసనీయత ఉండాలన్నారు. తన వ్యాఖ్యలకు పవన్ ఆధారాలు కలిగి ఉండాలని, బాధ్యతా రహిత్యంగా వ్యాఖ్యలు చేస్తే దానికి పర్యావసానాలు ఉంటాయన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, ఏ రాజకీయ పక్షమైన ప్రకటన చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పవన్ ప్రకటన చేసే సమయంలో తన మీటింగ్‌ను రౌడీలు, అసాంఘిక శక్తులు అడ్డంకులు సృష్టిస్తాయనే ప్రకటనకు ఆధారాలు చూపాలన్నారు.
మంగళవారం పవన్ తనపై దాడికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పెడనలో జరిగే కార్యక్రమంలో ఏపీ వైసీపీ ప్రభుత్వం కొందరు గుండాలు, క్రిమినల్స్ పబ్లిక్ మీటింగ్‌లోకి పంపి రాళ్లదాడి గొడవలు చేయడానికి పకడ్బందీగా వ్యూహం పన్నారని, పెడన సభలో గొడవలు పెట్టుకుంటే తాము సహించేది లేదని పవన్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే డీజీపీ బాధ్యతలు వహించాలన్నారు. రాళ్లదాడి, క్రిమినల్స్ దాడి చేసినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ ప్రకటించారు. పవన్ ఆరోపణల నేపథ్యంలో పెడనలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.