Konaseema : కోన‌సీమ జిల్లాలో ఘోరం.. ప్రేమ పేరుతో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు-pocso case has been registered against a person who raped a minor girl in konaseema district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema : కోన‌సీమ జిల్లాలో ఘోరం.. ప్రేమ పేరుతో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు

Konaseema : కోన‌సీమ జిల్లాలో ఘోరం.. ప్రేమ పేరుతో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు

HT Telugu Desk HT Telugu
Oct 01, 2024 09:34 AM IST

Konaseema : కోన‌సీమ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైన‌ర్ బాలిక‌పై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంత‌రం ప‌రార‌య్యాడు. పోలీసుల‌కు ఫిర్యాదు రావ‌డంతో.. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. అతని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి.. సోమ‌వారం నిందితుడిని అరెస్టు చేశారు.

మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం
మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం (HT)

కోనసీమ జిల్లా రామ‌చంద్రాపురం ప‌ట్ట‌ణంలో దారుణం జరిగింది. రామచంద్రాపురంలో ఒక కాలేజీలో ఇంట‌ర్మీడియ‌ట్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోన్న‌ 17 ఏళ్ల బాలిక‌పై.. అదే ప‌ట్టణానికి చెందిన గుత్తుల బాల వెంక‌ట‌కృష్ణ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం పరార‌య్యాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దాదాపు నెల‌న్న‌ర త‌రువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

రామచంద్రాపురం ప‌ట్టణానికి చెందిన గుత్తుల బాల వెంక‌ట‌కృష్ణ కొంత‌కాలంగా ఇంట‌ర్మీడియ‌ట్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోన్న‌ 17 ఏళ్ల బాలిక వెంట ప‌డి ప్రేమ పేరుతో వేధించేవాడు. అయితే.. ఆగ‌స్టు 16న మ‌ధ్యాహ్నం బాలిక ఇంట్లో ఎవ‌రూ లేరు. ఆమె ఒక్క‌తే ఒంట‌రిగా ఉంది. దీన్ని గ‌మ‌నించిన బాల వెంక‌ట‌కృష్ణ‌ మ‌ద్యం సేవించి, ఆమె ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెపై బ‌ల‌వంతంగా లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఆమె వ‌ద్ద‌ని ఎంత వారించిన‌ప్ప‌టికీ, వినిపించుకోకుండా నోరు మూసేసి, అత్యాచారం చేశాడు.

అనంత‌రం అక్క‌డి నుండి ప‌రార‌య్యాడు. ఆ బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు విష‌యం మొత్తం చెప్పింది. బాల వెంక‌ట‌కృష్ణ‌పై రామ‌చంద్ర‌పురం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆదివారం సాయంత్రం నిందితుడిని ప‌ట్టుకుని.. న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రుప‌రిచిన‌ట్లు సీఐ అశోక్ కుమార్ సోమ‌వారం తెలిపారు. నిందితుడికి కోర్టు జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధించిన‌ట్లు పేర్కొన్నారు.

కూతురిపై తండ్రి అత్యాచారం..

విశాఖ‌ప‌ట్నంలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 13 ఏళ్ల కుమార్తెపై క‌న్న తండ్రే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఒడిశాకు చెందిన చిత్త‌రంజ‌న్ పాత్రో (40) కుటుంబంతో కొన్నాళ్ల క్రితం విశాఖ‌ప‌ట్నం వ‌చ్చి ఆరిలోవ కాల‌నీలో ఉంటున్నాడు. మ‌ద్యానికి బానిసైన పాత్రో కూలి ప‌నుల‌కు పెద్ద‌గా వెళ్లేవాడు కాదు. ఆయన భార్య న‌గ‌రంలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఉద్యోగం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల పెద్ద కుమార్తె తోట‌గ‌రువు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఆమె నాలుగు రోజుల కిందట క‌ళ్లు తిరిగి త‌ర‌గ‌తి గ‌దిలో ప‌డిపోయింది.

దీంతో ఆ బాలిలకను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఉపాధ్యాయురాలు ఆరా తీశారు. అప్పుడు ఆ బాలిక జ‌రిగిన విష‌య‌మంతా ఉపాధ్యాయురాలికి వివ‌రించింది. త‌న త‌ల్లి ప్ర‌తి రోజు రాత్రి డ్యూటీకి ఆసుప‌త్రికి వెళ్తుంద‌ని, త‌న తండ్రి త‌న‌పై అత్యాచారం చేస్తున్నాడ‌ని తెలిపింది. దీంతో విస్తుపోయిన ఉపాధ్యాయురాలు విష‌యాన్ని ప్ర‌ధానోపాధ్యాయుడుకి, తోటి ఉపాధ్యాయుల‌కు తెలియ‌జేసింది. వారు ఆరిలోవ పోలీసుల‌కు తెలియ‌జేశారు. పోలీసులు బాలిక‌ను విచారించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చిత్త‌రంజ‌న్ పాత్రోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు.

మ‌రోవైపు ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల సాంఘిక సంక్షేమ శాఖ హాస్ట‌ల్‌లో దారుణం జరిగింది. హాస్టల్‌లో చ‌దువుతున్న ద‌ళిత బాలికపై వార్డెన్ వై. శ్రీ‌నివాస‌రావు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ు. అనంత‌రం అబార్ష‌న్ చేయించాడ‌ని, విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు దిగార‌ని బాలిక త‌ల్లిదండ్రులు ఆరోపించారు. వార్డెన్‌పై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదికలో క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. వార్డెన్‌పై ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు తీసుకోవ‌టం లేద‌ని వాపోయారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)