పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా 14 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరంలోని సరోజినీ నగర్ లో బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితులు డానిష్, అమీన్ ఆమె బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో బలవంతంగా కారులో ఎక్కించుకుని కృష్ణా నగర్ హోటల్ కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో (pocso act), ఇతర సంబంధిత చర్యల కింద కేసు నమోదు చేశామని, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సౌత్ డీసీపీ కేశవ్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హోటల్ సీసీటీవీ ఫుటేజీని కనుగొన్నామని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని కృష్ణానగర్ ఏసీపీ వినయ్ కుమార్ ద్వివేది తెలిపారు. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె బ్యాగ్ లాక్కుని, బలవంతంగా కారులోకి లాక్కెళ్లి కృష్ణా నగర్ లోని హోటల్ ప్యారడైజ్ శాంతి ఇన్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
బాధిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆ ఇధ్ధరు యువకులు, తమ చర్యను వీడియో రికార్డు చేశారని ఆ బాలిక తండ్రి తెలిపారు. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు.