Crime News : బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి చంపేసి స్కూల్ కాంపౌండ్‌లో పడేసిన ప్రిన్సిపాల్
Crime News : ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్ దారుణం చేశాడు. ఒకటో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె అరవడంతో చంపేసి స్కూల్ కౌంపౌండ్‌లోనే పడేశాడు.
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఆరేళ్ల బాలిక మృతిపై జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒకటో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో బాలిక ప్రతిఘటించడంతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్కూల్ కాంపౌండ్‌లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగ్, షూలను తరగతి గదికి సమీపంలో వేశాడు. ఈ కేసులో 55 ఏళ్ల గోవింద్ నట్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గురువారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ ప్రాంతంలో అందరూ షాక్‌కు గురయ్యారు. బాలిక ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే మరణించిన రోజున ప్రిన్సిపాల్ గోవింద్ నట్‌తో కలిసి తన కుమార్తె పాఠశాలకు వెళ్లిందని తల్లి పోలీసులకు తెలిపింది. పోలీసులు ప్రిన్సిపాల్‌తో మాట్లాడగా.. బాలికను పాఠశాలలో దించి వేరే పని మీద బయటకు వెళ్లిపోయానని చెప్పాడు.
అతడి సమాధానంతో పోలీసులకు నమ్మకం కలగలేదు. ఘటన జరిగిన రోజు గోవింద్ నట్ ఫోన్ లొకేషన్ వివరాలను పరిశీలించగా ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నట్లు తేలింది. అతడిని గట్టిగా విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు.
'ప్రిన్సిపాల్ ఉదయం 10.20 గంటల సమయంలో బాలిక ఇంటి దగ్గరలో ఉన్నాడు. బాలికను తల్లి ప్రిన్సిపాల్ కారులో ఎక్కించింది. కానీ తర్వాత బాలిక పాఠశాలకు చేరుకోలేదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని ధృవీకరించారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో ప్రిన్సిపాల్ ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. బాలిక అరవడం మెుదలుపెట్టింది. అరవకుండా ఆపడానికి ప్రయత్నం చేశాడు ప్రిన్సిపాల్. ఊపిరి ఆడక బాలిక చనిపోయింది.' అని సీనియర్ పోలీసు అధికారి రాజ్‌దీప్ సింగ్ ఝాలా చెప్పారు.
పాఠశాలకు చేరుకోగానే ప్రిన్సిపాల్ బాలిక మృతదేహాన్ని కారులో వదిలేసి లాక్ వేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మృతదేహాన్ని పాఠశాల భవనం వెనుక పడేశాడు. ఆమె తరగతి గది వెలుపల ఆమె స్కూల్ బ్యాగ్, బూట్లను పెట్టాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు ఒప్పుకొన్నాడు. ప్రిన్సిపాల్ గోవింద్ నట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ స్పందించారు. 'ఈఘటనతో నేను చాలా బాధపడ్డాను. ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.' అని చెప్పారు.
టాపిక్