POCSO Court: వరుస‌కు కుమార్తెల‌య్యే ఇద్దరి బాలిక‌ల‌పై పిన‌తండ్రి లైంగిక దాడి... భార్యాభర్తలకు పోక్సోకోర్టు జైలు శిక్ష-stepfather sexually assaulted two girls with the help of wifw ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pocso Court: వరుస‌కు కుమార్తెల‌య్యే ఇద్దరి బాలిక‌ల‌పై పిన‌తండ్రి లైంగిక దాడి... భార్యాభర్తలకు పోక్సోకోర్టు జైలు శిక్ష

POCSO Court: వరుస‌కు కుమార్తెల‌య్యే ఇద్దరి బాలిక‌ల‌పై పిన‌తండ్రి లైంగిక దాడి... భార్యాభర్తలకు పోక్సోకోర్టు జైలు శిక్ష

HT Telugu Desk HT Telugu
Sep 24, 2024 09:18 AM IST

POCSO Court: ఏలూరులో పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. వ‌రుస‌కు కుమార్తల‌య్యే ఇద్ద‌రి బాలిక‌ల‌పై లైంగిక‌దాడికి పాల్పడిన సవతితండ్రికి బ‌తికున్నంత‌కాలం యావ‌జ్జీవ కారాగార శిక్ష, నిందితుడికి స‌హ‌క‌రించిన బాలిక‌ల త‌ల్లికి కూడా జీవిత‌కాల‌ జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు తీర్పునిచ్చింది.

కన్నతల్లి సహకారంతో మారుబిడ్డలపై తండ్రి అత్యాచారం
కన్నతల్లి సహకారంతో మారుబిడ్డలపై తండ్రి అత్యాచారం

POCSO Court: కన్నబిడ్డలతో తల్లి కర్కశంగా ప్రవర్తించింది. మారుతండ్రి అకృత్యాలను వారి తల్లికి చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. విషాదకరమైన ఘటనలో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేర‌కు సోమ‌వారం పోక్సో కోర్టు జ‌డ్జి ఎస్‌.ఉమాసునంద ఈ తీర్పును వెల్ల‌డించారు. నిందితులిద్ద‌రికి రూ.18 వేలు చొప్పున‌ జ‌రిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ప్ర‌ధాన నిందితుడికి స‌హ‌క‌రించిన షేక్ స‌త్తార్‌, బీఎస్‌కే నాగూర్‌, హుస్సేన్ వ‌లీ, దూబ‌చ‌ర్ల వీణ‌కు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితుల‌కు ఒక్కొక్క‌రికీ రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం అంద‌జేయాల‌ని ఆదేశించారు.

ఏలూరు జిల్లా పెద‌పాడు మండ‌లం వ‌ట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజ‌య‌ల‌క్ష్మి ఫ‌ణిరూప (38)కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. విజ‌య‌ల‌క్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట స‌తీష్ ప‌వ‌న్ కుమార్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్ర‌మంలో విజ‌య‌ల‌క్ష్మి ఫ‌ణిరూప ఇద్ద‌రు కుమార్తెల‌పై స‌తీష్ ప‌వ‌న్ కుమార్ క‌న్నేశాడు.

వారిని ఎలాగైన లోబ‌ర్చుకుని కోవాల‌ని అనుకున్నాడు. అందుకు భార్య విజ‌య‌ల‌క్ష్మి స‌హ‌కారం తీసుకున్నాడు. కొత్త మొగుడు మోజులో త‌న క‌న్న బిడ్డ‌ల‌పై అఘాయిత్యానికి త‌ల్లే విజ‌య‌ల‌క్ష్మి స‌హ‌కరించింది. అభం, శుభం తెలియ‌న ఆ ఇద్ద‌రు కుమార్తెలను బెదిరించి స‌తీష్ ప‌వ‌న్ కుమార్ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు.

ప‌వ‌న్ కుమార్ ఆగ‌డాల‌ను భ‌రించ‌లేక ఇద్దు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఏలూరు మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మ‌హిళా పోలీస్ స్టేష‌న్ సీఐ ఇంద్ర శ్రీ‌నివాస‌రావు కేసు న‌మోదు చేశారు. నిందితులు పుట్ట స‌తీష్ ప‌వ‌న్ కుమార్‌, పుట్ట విజ‌య‌ల‌క్ష్మి ఫ‌ణిరూప‌ను జూలై 14న అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు పరిచారు.

విచార‌ణ‌లో పుట్ట స‌తీష్ ప‌వ‌న్ కుమార్‌, పుట్ట విజ‌య‌ల‌క్ష్మి ఫ‌ణిరూపల‌పై నేరం రుజువు కావ‌డంతో సోమ‌వారం పోక్సో కోర్టు జ‌డ్జి ఎస్‌.ఉమాసునంద నిందితులిద్ద‌రూ బ‌తికున్నంత కాలం జీవిత ఖైదు శిక్ష‌తో పాటు రూ.18 వేలు జ‌రిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్ర‌ధాన నిందితుడికి స‌హ‌క‌రించిన షేక్ స‌త్తార్‌, బీఎస్‌కే నాగూర్‌, హుస్సేన్ వ‌లీ, దూబ‌చ‌ర్ల వీణ‌కు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితుల‌కు ఒక్కొక్క‌రికీ రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం అంద‌జేయాల‌ని తీర్పు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

మ‌తిస్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారం

ప్ర‌కాశం జిల్లాలో ఘోర సంఘట‌న చోటు చేసుకుంది. మ‌తిస్థిమితం లేని అమ్మాయిపై ఒక ప్ర‌బుద్ధుడు అత్యాచారం చేశాడు. పొదిలి మండలంలోని మూగ‌చింత‌ల గ్రామంలో నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పొదిలి మండలంలోని మూగ‌చింత‌ల గ్రామానికి చెందిన వేల్పుల రాహేల‌య్య రైతు వ‌ద్ద పొలంలో కూలీ ప‌నులు చేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన మ‌తిస్థిమితం స‌రిగా లేని అమ్మాయికు త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో అన్న వ‌దిన‌ల ద‌గ్గ‌ర ఉంటూ కూలీ ప‌నుల‌కు వెళ్లేది. అయితే వారం రోజుల నుంచి ఆమె మేక‌లు కాయ‌డానికి పొలానికి వెళ్తోంది. ఆ ప్రాంతంలో పొగ‌నారు దొడ్ల వ‌ద్ద ఉన్న వేల్పుల ర‌హేల‌య్య ఈమెపై బ‌లాత్కారం చేశాడు.

జ‌రిగిన విష‌యంలో ఎవ‌రికీ చెప్పొద్ద‌ని, చెబితే నిన్ను చంపేస్తాన‌ని బెదిరించాడు. దీంతో ఆమెకు ఎవ‌రికీ చెప్ప‌లేదు. అయితే అమ్మాయికి తీవ్ర ర‌క్త‌స్రావం అవ‌డంతో అన్న‌, వ‌దిన క‌నిగిరిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ ఆమెకు వైద్య ప‌రీక్ష‌లు చేశారు. వైద్య ప‌రీక్ష‌ల రిపోర్టుల‌ను చేసిన‌ డాక్ట‌ర్, జ‌రిగిన విష‌యాన్ని వారికి తెలియ‌జేశారు. మెరుగైన వైద్యం కోసం వెంట‌నే ఒంగోలు రిమ్స్ ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. వెంట‌నే వారు ఒంగోలు రిమ్స్‌కు ఆ అమ్మాయిని త‌ర‌లించారు. అలాగే ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌తిస్థిమితం లేని అమ్మాయిపై బ‌లాత్కారానికి పాల్ప‌డిన వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)