Cristiano Ronaldo: సోషల్ మీడియాలో క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఫాలోవర్ల రికార్డు
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ప్లాట్‌ఫామ్ లలో కలిపి ఏకంగా 100 కోట్ల ఫాలోవర్ల మార్క్ అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.
Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో అంటేనే రికార్డుల రారాజు. అది ఫుట్‌బాల్ ఫీల్డ్ లో అయినా, బయట అయినా కూడా. ఈ పోర్చుగల్ స్టార్ ప్లేయర్ తాజాగా సోషల్ మీడియాలో ఇంత వరకూ ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియా ఛానెల్స్ లో 100 కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకొని చరిత్రను తిరగరాశాడు.
రొనాల్డో సోషల్ మీడియా ఫాలోవర్స్
ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా క్రిస్టియానో రొనాల్డోకు పేరున్న విషయం తెలిసిందే. అతనికి ఈ ప్లాట్‌ఫామ్ పై ఏకంగా 63.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఈమధ్యే UR. Cristiano పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా అతడు స్టార్ట్ చేశాడు. ఈ ఛానెల్ కేవలం వారంలోనే 5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది.
తొలి మిలియన్ మార్క్ అందుకోవడానికి అతనికి కేవలం 90 నిమిషాలు మాత్రమే పట్టిందంటే రొనాల్డోకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తంగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల సంఖ్య 100 కోట్లు దాటినట్లు రొనాల్డోనే తన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వెల్లడించాడు.
బిలియన్ ఫాలోవర్లు
"మనం చరిత్ర సృష్టించాం. 1 బిలియన్ (100 కోట్లు) ఫాలోవర్లు.. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. ఆట పట్ల మనకున్న అభిరుచి, ప్రేమ, అంతకు మించినది. మదీరా వీధుల నుంచి ప్రపంచంలోని పెద్ద పెద్ద టోర్నీల వరకు నేనెప్పుడూ నా కుటుంబం, కోసం మీ కోసమే ఆడాను. ఇప్పుడు మనం 100 కోట్ల మంది ఒక్కటిగా నిలబడ్డాం. ఈ దారిలో ప్రతి అడుగులోనూ, ఒడిదుడుకుల్లోనూ మీరు నా వెంటే ఉన్నారు.
ఈ ప్రయాణం మన ప్రయాణం. అందరి కలిసి మనం సాధించేదానికి ఓ లిమిట్ అంటూ లేదని నిరూపించాం. నాపై నమ్మకం ఉంచినందుకు, మద్దతుగా నిలిచినందుకు, నా జీవితంలో భాగమైనందుకు థ్యాంక్యూ. నాలోని బెస్ట్ రాబోయే రోజుల్లో రానుంది. మనం ఇలాగే ముందుకు సాగుదాం. గెలుద్దాం. చరిత్రను తిరగరాద్దాం" అని రొనాల్డో ఈ పోస్ట్ షేర్ చేశాడు.
రొనాల్డో మరో రికార్డు
రికార్డులను క్రియేట్ చేయడం, తిరగ రాయడమే పనిగా పెట్టుకొనే రొనాల్డో.. ఈ మధ్యే ఫుట్‌బాల్ ఫీల్డ్ లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 900 కెరీర్ గోల్స్ సాధించిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్ గా నిలిచాడు. పోర్చుగల్ నేషన్స్ లీగ్ లో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో విన్నింగ్ గోల్ చేయడం ద్వారా రొనాల్డో ఈ రికార్డును సాధించాడు. ఆ వెంటనే ఇప్పుడిలా సోషల్ మీడియాలో 1 బిలియన్ ఫాలోవర్ల రికార్డును అందుకున్నాడు.