Pawan Kalyan : జగన్ కంపెనీపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం!-pawan kalyan orders officials to give report on saraswati power lands ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : జగన్ కంపెనీపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం!

Pawan Kalyan : జగన్ కంపెనీపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం!

Basani Shiva Kumar HT Telugu
Oct 25, 2024 10:38 PM IST

Pawan Kalyan : ఓవైపు ఆస్తి పంపకాల విషయంలో జగన్ వర్సెస్ షర్మిల ఫైట్ నడుస్తోంది. దీనిపై పొలిటికల్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఏవైనా ఉన్నాయా?.. ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని.. అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగులోని వచ్చిన క్రమంలో పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు.

సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియజేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. వాగులు, వంకలు, కొండలు ఉన్నందున ఆ సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో చెప్పాలని.. పీ.సీ.బీ.కీ ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు.

సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..

జగన్, షర్మిల ఆస్తి పంపకాల వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'అవి జగన్‌ సొంత సంస్థలు. వాటిలో షర్మిల వాటాదారు కాదు. దాన్ని ఆనాడు వైఎస్సార్‌ కూడా కోరుకోలేదు. ఆయన ఉన్నప్పుడే జగన్‌ ఆ కంపెనీలు ప్రారంభించారు. అవి జగన్‌ స్వార్జితం. అయినా చెల్లికి వాటా ఇస్తానన్నారు. హైకోర్టు స్టేటస్‌కో ఉన్నా షర్మిల షేర్లు మార్చుకున్నారు. అందుకే జగన్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. అంతే తప్ప.. ఆస్తుల కోసం కోర్టు మెట్లు ఎక్కలేదు' అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

'జగన్‌ కంపెనీల్లో షర్మిల వాటాదారనుకుంటే ఆమె పేరెందుకు లేదు? భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌ అనే ఎందుకు పెట్టారు? అదంతా వైఎస్సార్‌ హయాంలోనే జరిగింది కదా? ఆయన కూడా షర్మిలను షేర్‌హోల్డర్‌గా కోరుకోలేదు. తాను చెల్లికి ఇస్తోంది స్వార్జిత ఆస్తులని ఎంఓయూలో ఉంది. అదే విషయాన్ని ఎంఓయూలో జగన్‌ స్పష్టంగా రాశారు. అది చదివాకే షర్మిల, విజయమ్మ ఇద్దరూ సంతకాలు చేశారు. అలాంటప్పుడు కంపెనీల్లో షర్మిల ఎలా వాటాదారవుతారు? జగన్‌ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిల ప్రమేయం లేదు' అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

'ఇచ్చిన మాట కోసం జగన్‌ కాంగ్రెస్‌‌ను వీడారు. అన్యాయంగా కేసులు పెడితే 16 నెలలు జైల్లో ఉన్నారు. ఎన్నో బాధలు పడ్డారు. అవమానాలూ ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ మాట తప్పలేదు. అబద్ధాలు చెప్పలేదు. రాజకీయాల్లో ఎక్కడా అనైతికంగా వ్యవహరించలేదు. అలాంటి వ్యక్తి, మీకు ఇచ్చిన మాట తప్పుతారా?. అలా అయితే అసలు ఎంఓయూ రాసి ఇస్తారా? మీకు ప్రేమ, అభిమానంతోనే కదా ఆస్తులు ఇస్తానంది. ఇవన్నీ ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? వీటన్నింటినీ మీ విచక్షణ, వివేకానికే వదిలేస్తున్నాం' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Whats_app_banner